Lets Metro for CBN programme in Hyderabad : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ... ఐటీ ఉద్యోగులు ఇవాళ నగరంలో లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ కార్యక్రమాన్ని(Lets Metro for CBN) చేపట్టారు. నల్ల టీ షర్ట్స్, నల్ల షర్ట్స్ ధరించి మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు ప్రయాణించాలని ఐటీ ఉద్యోగుల నిర్ణయించారు. ఐటీ ఉద్యోగుల లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ ప్రోగ్రామ్‌తో ఎల్బీనగర్, మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద పోలీసులు అప్రమత్తమయ్యారు. నల్లషర్ట్, టీషర్ట్ ధరించి వచ్చే వారిని మెట్రో స్టేషన్లోకి రానివ్వకుండా పోలీసులు, మెట్రో సెక్యురిటీ సిబ్బంది అడ్డుకున్నారు.
ఎల్బీనగర్ వద్ద నల్ల టీషర్ట్ వేసుకొని వచ్చిన యువకులను పోలీసులు అడ్డుకోవడంతో కొందరు యువకులు పక్కనే ఉన్న డీ-మార్ట్ లోకి వెళ్లి వేరే రంగు టీషర్ట్స్ కొనుగోలు చేసి.. వేసుకుంటున్నారు. మెట్రో స్టేషన్ బయటే కాకుండా.. మెట్రో స్టేషన్ ఫ్లాట్ ఫాంపై కూడా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారు. ఓ దశలో మియాపూర్ మెట్రో స్టేషన్లోకి ఎవరూ రాకుండా అడ్డుకున్నారు. టీడీపీ శ్రేణుల ఆందోళనతో పోలీసులు దిగివచ్చారు. ఏపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మియాపూర్ మెట్రో స్టేషన్ వద్దకు వచ్చి ఐటీ ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఈ విధంగా చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఇలా వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
"తెలంగాణలో కూడా చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ నెల రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. అందరూ నల్ల టీషర్టులు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అహింస మార్గంలోనే శాంతియుతంగా నిరసనలు చెబుతున్నారు. జైలులో చంద్రబాబుకు ప్రాణ హాని కూడా ఉంది. ఐటీ ఉద్యోగుల నుంచి నా లాంటి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా మేము కూడా సీబీఎన్ వెంట ఉన్నామంటున్నాము. చంద్రబాబును జైలులో పెట్టి ప్రజా క్షేత్రానికి దూరం చేసి ఎన్నికలకు పోవాలని జగన్ చూస్తున్నారు." - ఉండవల్లి శ్రీదేవి, తాడికొండ ఎమ్మెల్యే
IT Employees Protest Chandrababu Arrest : వీరి ఆందోళనలతో పోలీసులు వారిని మెట్రోలో ప్రయాణం చేసేందుకు అనుమతించారు. అంతకు ముందు మియాపూర్ మెట్రో స్టేషన్‌ను అధికారులు మూసేశారు. నల్ల దుస్తులు ధరించిన వారందరినీ అడ్డుకుని పోలీసులు ధరించారు. మియాపూర్ నుంచి అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ వరకు నల్ల షర్ట్లతో మెట్రో రైలులో ప్రయాణిస్తున్న వారిని గుర్తించి.. పోలీసులు అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో దించేశారు. వారిని అరెస్ట్ చేసి ఎస్సాఆర్‌నగర్ స్టేషన్‌కు తరలించారు. దాంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. అలాగే ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు మెట్రోలో తిరిగి వెళ్లేందుకు ఐటీ ఉద్యోగుల యత్నం.. టికెట్లు ఇవ్వకుండా పోలీసులు, మెట్రో సిబ్బంది అడ్డుకున్నారు. వారిని బస్సులో వెళ్లాలంటూ సూచించారు. బస్సులో వెళ్లం.. మెట్రోలోనే వెళతామంటూ ఎల్బీనగర్ వద్ద ఐటీ ఉద్యోగులు నిరసనలు తెలిపారు. మరోవైపు మధురానగర్ వద్ద ఐటీ ఉద్యోగులను పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భారీ సంఖ్యలో ప్రతి మెట్రో స్టేషన్ వద్దకు ఐటీ ఉద్యోగులు, చంద్రబాబు అభిమానులు చేరుకొని.. చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు.