జమ్ములో వాయుసేన స్థావరంపై డ్రోన్ దాడి.. ఉగ్రసంస్థ లష్కరే తొయిబా పనే అని అధికారులు అనుమానిస్తున్నారు. ఆదివారం ఉదయం డ్రోన్లు సరిహద్దు ఆవల నుంచే వచ్చాయని భావిస్తున్నట్లు జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే అన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు.
ఆదివారం తెల్లవారుజామున వైమానిక స్థావరంపై ముష్కరులు డ్రోన్ల ద్వారా దాడులు జరపగా ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. డ్రోన్ కాక్టైల్ భాగంలో ఆర్డీఎక్స్ను పేలుడుకు ఉపయోగించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మంగళవారమే ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించారు.
జమ్ములో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అనుమానాస్పద ప్రాంతాల్లో వరుసగా సోదాలు జరుగుతున్నాయి. అనధికారికంగా ఎలాంటి డ్రోన్లను వాడకూడదని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.