సకాలంలో వైద్యం అందక గర్భం నుంచి కాలు బయటకు వచ్చి శిశువు మరణించిన హృదయ విదారక ఘటన కర్ణాటక విజయపుర జిల్లాలో జరిగింది. ఈ విషాద ఘటనలో గర్భిణీ స్త్రీని ప్రాణాలతో కాపాడగలిగారు వైద్యులు.


కనికరించని ఆసుపత్రులు..
పురిటి నొప్పులతో బాధపడుతున్న బాబలేశ్వర్‌కు చెందిన గర్భిణీని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు ఆమె కుటుంబ సభ్యులు. గర్భిణీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆమెకు చికిత్స చేయలేమని.. విజయపురాకి తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. దీనితో.. అంబులెన్స్‌లో విజయపురకు చేరుకున్న కుటుంబ సభ్యులు.. నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగినప్పటికీ నిండు చూలాలికి వైద్యం అందించేందుకు నిరాకరించాయి.

ఆలస్యంతో ఆగిన ఊపిరి..
చివరకు.. జలనగర్లోని సంజీవ ప్రసూతి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే తల్లి కడుపు నుంచి శిశువు కాలు బయటకు వచ్చినట్లు గుర్తించారు వైద్యులు. శస్త్ర చికిత్స ద్వారా బిడ్డను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే.. బొడ్డు తాడు మెడకు చుట్టుకుని శిశువు మరణించినట్లు డాక్టర్ విజయ కుమార్ తెలిపారు. ఆపరేషన్ ద్వారా మృతశిశువును బయటకు తీసి.. తల్లి ప్రాణాలను కాపాడారు. సకాలంలో వైద్యం అందకనే బిడ్డ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఇవీ చదవండి: ఆయువు తీసిన ఆవు పేడ చికిత్స