Lata Mangeshkar Award: లతా దీనానాథ్ మంగేష్కర్ తొలి అవార్డును అందుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డును ఏర్పాటు చేశారు. ముంబయిలోని షణ్ముకానంద హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు మోదీ. అంతకుముందు లతా మంగేష్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ అవార్డును దేశప్రజలందరికీ అంకితం చేస్తున్నట్లు చెప్పారు.
" లతా దీదీ లాంటి సోదరి పేరుపై అవార్డు వస్తే అది ఆమెలోని ఏకత్వానికి, నాపై ఉన్న ప్రేమకు ప్రతీక. కాబట్టి, అంగీకరించకపోవడానికి నాకు సాధ్యం కాదు. ఈ అవార్డును దేశప్రజలందరికీ అంకితమిస్తున్నాను. లతా దీదీ నాకు పెద్ద అక్కలాంటి వారు. ఆమె మాతా సరస్వతి దేవికి ప్రతిరూపం. చాలా దశాబ్దాల తర్వాత ఆమె లేకుండా తొలిసారి రాఖీ పౌర్ణమి జరుపుకోవాల్సి వస్తోంది."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
దేశానికి, ప్రజలకు, సమాజానికి మార్గనిర్దేశం చేస్తూ.. విశేష కృషి చేసే వ్యక్తికి ఈ అవార్డును ప్రతిఏటా అందజేస్తామని మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ స్మృతి ప్రతిష్ఠాన్ ఛారిటబుల్ ట్రస్ట్ తెలిపింది. ఈ కార్యక్రమానికి ఉషా మంగేష్కర్, ఆశా భోస్లే, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, మహారాష్ట్ర ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్ సహా ప్రముఖులు హాజరయ్యారు. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ 92 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఈ ఏడాది ఫిబ్రవరి 6న కన్నుమూశారు.
ఇదీ చూడండి: లతా మంగేష్కర్ పేరిట మ్యూజిక్ అకాడమీ, రాష్ట్ర అవార్డు