బిహార్ ఎన్నికలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన ఏఐఎంఐఎం పార్టీ.. ఇప్పుడు బంగాల్పై కన్నేసింది. వచ్చే ఏడాది జరగనున్న బంగాల్ శాసనసభ ఎన్నికల్లో తమ ప్రభావం చూపించాలని దృఢ నిశ్చయంతో ఉంది. అయితే లక్ష్యాన్ని చేరుకునే ముందు ఆ పార్టీకి అనుకోని సమస్య ఒకటి వచ్చి పడింది. దానిని పరిష్కరించేందుకు ఏఐఎంఐఎం నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
వాంటెడ్..
బంగాల్ ఎన్నికల కోసం అసదుద్దీన్ ఓవైసి నేతృత్వంలోని ఏఐఎంఐఎం ముమ్మర కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం అనర్గళంగా బెంగాలీ మాట్లాడగలిగే ముస్లింల కోసం అన్వేషిస్తోంది. రాష్ట్రంలో తమ సందేశాన్ని ముందుకు తీసుకెళ్లగలిగేందుకు వీరు ఉపయోగపడతారని ఆశిస్తోంది.
బంగాల్లో ఏఐఎంఐఎం ఉనికి ఎప్పటి నుంచో ఉంది. కానీ అది కేవలం ఉర్దూ మాట్లాడే ముస్లింలకే పరిమితమైంది. రాష్ట్రవ్యాప్తంగా వీరు 6 శాతమే ఉన్నారు. అది కూడా కోల్‌కతా, దక్షిణ 24 పరగణాలు, ఉత్తర్ 24 పరగాణాలు, ఉత్తర దినాజ్‌పుర్, అసన్సోల్ సబ్-డివిజన్లకే పరిమితం.
ఇదీ చూడండి:- 'బిహార్‌లో మహాకూటమి ఓటమికి ఓవైసీనే కారణం'
రాష్ట్రంలోని ముస్లిం జనాభాపై తమ ముద్ర వేయాలనుకుంటున్న అసదుద్దీన్ పార్టీకి ఇది సరిపోదు. ముస్లింల ప్రభావం ఎక్కువ ఉన్న ముర్షిదాబాద్, మాల్డా జిల్లాలో ఎక్కువ మంది బెంగాలీ మాట్లాడే వారే ఉన్నారు. వారిని ఆకర్షించాలంటే అనర్గళంగా బెంగాలీ మాట్లాడగలిగేవారు పార్టీకి ఎంతో అవసరం.
"అనర్గళంగా బెంగాలీ భాష మాట్లాడగలిగే వారికోసం అన్వేషిస్తున్నాం. రాజకీయేతర సంఘాలతో చర్చలు జరుపుతున్నాం. బెంగాలీ మాట్లాడేవారు త్వరలోనే మాకు దొరుకుతారని ఆశిస్తున్నాం."
-- ఏఐఎంఐఎం ఆఫీస్ బేరర్.
అయితే ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని పార్టీ జాతీయ ప్రతినిధి, బంగాల్లోని పార్టీ పర్యవేక్షకుడు ఆసిమ్ వకార్ అభిప్రాయపడ్డారు. ఒక్కసారి అసదుద్దీన్ ఓవైసి రాష్ట్రానికి వచ్చి ప్రసంగిస్తే సరిపోతుందని.. ఆయన కోసం ప్రజలు బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
అసదుద్దీన్ ఓవైసి.. ఈ నెలలో ముర్షిదాబాద్‌లో ర్యాలీ నిర్వహిస్తారని సమాచారం. ఇందుకు సంబంధించిన తేదీ ఇంకా ఖరారు కాలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు.. ఏఐఎంఐఎం ఎన్ని చర్యలు చేపట్టినా లాభం లేదని అధికార తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు చెబుతున్నారు. బంగాల్ ప్రజల మనసులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారని.. భాజపా-ఆర్ఎస్ఎస్, ఏఐఎంఐఎం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరిపోవని తేల్చిచెబుతున్నారు.
ఇదీ చూడండి:- బంగాల్ ఎన్నికలకు ముందు ఎంఐఎంకు షాక్