దేశంలో కరోనా నిర్వహణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది లాన్సెట్ నిపుణుల బృందం. ఉచిత కరోనా టీకాలను పంపిణీ చేసేందుకు.. కేంద్ర వ్యవస్థను నెలకొల్పాలని సూచించింది. టీకాల కొనుగోలు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టబెట్టిన ప్రస్తుత వికేంద్రీకృత వ్యవస్థను తొలగించాలని పేర్కొంది. తద్వారా టీకా ధర సమంజసంగా ఉంటుందని, రాష్ట్రాల మధ్య అసమానతలను తగ్గిస్తుందని తెలిపింది.
'లాన్సెట్ సిటిజన్స్ కమిషన్ ఆన్ రీఇమేజినింగ్ ఇండియాస్ హెల్త్ సిస్టమ్' పేరిట గతేడాది డిసెంబర్లో ఏర్పాటైన బృందం ఈ సూచనలు చేసింది. 21 మంది నిపుణులు ఇందులో ఉంటారు. వీరి సిఫార్సులు బ్రిటిషన్ మెడికల్ జర్నల్ 'లాన్సెట్'లో ప్రచురితమయ్యాయి.
8 సిఫార్సులు ఇవే
- కొవిడ్ టీకాలను ఉచితంగా అందించేందుకు కేంద్రీయ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
- స్థానిక పరిస్థితులకు అనుగుణంగా స్పందించే స్వయంప్రతిపత్తి జిల్లా స్థాయి వర్కింగ్ గ్రూప్‌లకు ఉండాలి.
- వైద్య వ్యవస్థలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకునే వనరులు, నిధులు వీరికి అందుబాటులో ఉండాలి.
- జాతీయ స్థాయిలో పారదర్శక ధరల విధానం ఉండాలి. అత్యవసర వైద్య సేవలపై పరిమితులు విధించాలి. కొవిడ్ నిర్వహణపై ఆధారాలతో కూడిన సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి.
- వైరస్‌పై సమర్థంగా పోరాడేందుకు ప్రైవేటు సహా అన్ని రంగాల వైద్య వ్యవస్థలకు చెందిన మానవ వనరులను సమీకరించాలి.
- చికిత్స అందుబాటులో ఉండేలా చూసేందుకు, వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించేందుకు, కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం, సివిల్ సొసైటీ సంస్థల మధ్య మెరుగైన సమన్వయం ఉండాలి.
- సమాచార సేకరణలో ప్రభుత్వం పారదర్శకత పాటించాలి. డేటాను విశ్లేషించి తగిన చర్యలు తీసుకునేలా జిల్లా యంత్రాంగాలకు మార్గదర్శనం చేయాలి. వచ్చే వారాల్లో కేసుల తీవ్రతపై అప్రమత్తం చేయాలి.
- మహమ్మారి వల్ల ఉద్యోగాలు కోల్పోయిన భారత్‌లోని అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వం నేరుగా నగదు బదిలీలు చేపట్టాలి. ఈ విధంగా తీవ్రంగా నష్టపోయిన వర్గాలను ఆదుకోవాలి.
కరోనా వల్ల సంభవించిన ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ఈ సిఫార్సులు ఉపయోగపడతాయని ఈ బృందం పేర్కొంది. ఇందుకోసం తక్షణమే ఈ చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని సూచించింది.
ఇవీ చదవండి-