హిమాలయ పర్వత సానువుల నడుమ, సుందర పర్యాటక ప్రాంతమైన లద్దాఖ్(Ladakh)... ఆనందం, అయోమయం మధ్య కొట్టుమిట్టాడుతోంది! ఒకప్పటి జమ్ముకశ్మీర్‌లో అంతర్భాగంగా ఉన్న లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించినందుకు స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ.. ఆర్టికల్-370 రద్దు(Abrogation of Article 370) అంశం వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దేశమంతటికీ ఇక్కడ అవకాశాల తలుపులు తెరుస్తున్నట్టు కేంద్రం చేసిన ప్రకటనతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక్కడ ఎవర్ని పలకరించినా, అప్రయత్నంగా వినిపిస్తున్న పదం... 'కన్ఫ్యూజన్'!
పర్యాటకమే లద్దాఖ్ ప్రజలకు ప్రధాన జీవనాధారం. మూడున్నర లక్షల జనాభా ఉండే ఈ గిరిజన ప్రాంతంలో ఏటా మే-సెప్టెంబరు మధ్య నిత్యం లక్ష మంది పర్యటిస్తుంటారు.(Ladakh tourism) ఈ కేంద్రపాలిత ప్రాంత రాజధాని లేహ్‌లో(Leh ladakh) 1,500కి పైగా హోటళ్లు, 4 వేలకుపైగా వాహనాలు ఉన్నాయి. వీటి ద్వారా స్థానికులు ఆదాయం పొందుతున్నారు. ఇప్పటివరకు బయటివారు వచ్చిపోవడమే తప్ప, స్థానికంగా వ్యాపారాలు చేయడం, ఆస్తులు సమకూర్చుకోవడం జరగలేదు. ఈ క్రమంలో- ఆర్టికల్-370ని ఎత్తివేసి, ఎవరైనా ఇక్కడ ఆస్తులు కొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్రం చేసిన ప్రకటన స్థానికుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది!
మోదీకి ధన్యవాదాలు, కానీ...
తమ చిరకాల కల అయిన కేంద్రపాలిత ప్రాంతాన్ని నెరవేర్చినందుకు ప్రధాని మోదీకి(PM Modi) లద్దాఖ్ ప్రజలు ధన్యవాదాలు చెబుతున్నారు. ప్రధాని స్థానంలో మరెవరున్నా ఇది నిజమయ్యేది కాదంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కానీ- పార్లమెంటులో జమ్ముకశ్మీర్ విభజన బిల్లుపై హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, ఈ ప్రాంతం అభివృద్ధికి ద్వారాలు తెరుస్తున్నామని, ఎవరైనా ఇక్కడ ఆస్తులు కొనుగోలుచేసి అభివృద్ధి చేసుకోవచ్చన్న వ్యాఖ్యలను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇన్నాళ్లూ స్థానికులే వ్యాపారాలు చేసుకోవడం వల్ల జీవితాలను ఏదోలా నెట్టుకొచ్చామని, కార్పొరేట్ సంస్థలకు గేట్లు తెరిస్తే వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో వచ్చేవారికి తాము ఎలా ఎదురు నిలవగలమని ప్రశ్నిస్తున్నారు. అదే జరిగితే... ఇప్పటివరకు హోటళ్లు, వాహనాలకు యజమానులుగా ఉన్న తాము అదేచోట పనివారిగా చేరాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. తమ హక్కులకు భద్రత కల్పించాలని, ఇక్కడి ఆస్తులను బయటివారు కొనుగోలు చేయకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆ పరిస్థితి మాకొద్దు...
అభివృద్ధి పేరుతో చేపట్టే కార్యకలాపాల వల్ల లద్దాఖ్(Ladakh) పర్యావరణం దెబ్బతిని మొదటికే మోసం వస్తుందన్న ఆందోళన స్థానికుల్లో కనిపిస్తోంది. శిమ్లా, మనాలి, దార్జీలింగ్ తదితర చోట్ల అభివృద్ధికి గేట్లు తెరవడంవల్ల అక్కడి పర్యావరణం, సామాజిక గుర్తింపు ధ్వంసమైపోయాయని... ఆ పరిస్థితి తమకు వద్దంటున్నారు. పర్యావరణ పరంగా లద్దాఖ్ అత్యంత సున్నితమైన ప్రాంతమని, నిర్మాణాలకు అనుమతిస్తే ఇక్కడి వాతావరణం తీవ్రంగా దెబ్బతింటుందని, క్రమంగా పర్యాటకుల రాక తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నారు. లద్దాఖ్‌ను యూటీగా ప్రకటించిన తర్వాత... సరైన అధికార వ్యవస్థను ఏర్పాటు చేయలేదని, ఫలితంగా ఏ పనులూ ముందుకు సాగడంలేదని చెబుతున్నారు.
ప్రజల గొంతు వినేవారేరి?
"లద్దాఖ్‌ను దిల్లీ, పుదుచ్చేరి తరహాలో శాసనసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా మార్చి ఉండాల్సింది. అలాగైతే మా సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించడం వీలయ్యేది. ఇప్పుడు మా గొంతు వినేవారే లేరు. మాకు అభివృద్ధి కంటే సుస్థిర పర్యావరణమే ముఖ్యం. దశాబ్దాల కిందటి నుంచే ఇక్కడ ప్లాస్టిక్‌ను నిషేధించి పర్యావరణాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు అభివృద్ధి పేరుతో అందరికీ తలుపులు తెరిస్తే.. కాలుష్యం పెరిగి లద్దాఖ్ గుర్తింపే కనుమరుగయ్యే ప్రమాదముంది" అని స్థానిక ట్రావెల్ ఏజెంట్ ఒకరు పేర్కొన్నారు. లద్దాఖ్ పరిసరాలు ప్రశాంతంగా ఉండటం వల్లే వలస పక్షులను, అందమైన సరస్సులను చూసేందుకు పర్యాటకులు వస్తున్నారని.. ప్రణాళికారహిత అభివృద్ధితో గాలి, నీటి ప్రవాహాలు దెబ్బతిని లద్దాఖ్ తన సహజ స్వరూపాన్ని కోల్పోతుందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆ పరిస్థితి వస్తే తెగువ చూపిస్తాం
లద్దాఖ్‌లో మే-సెప్టెంబరు మధ్యే పర్యాటక సీజన్ ఉంటుంది. అభివృద్ధి పనులు జరగాలన్నా, పర్యాటకులు రావాలన్నా ఇదే సమయం. మిగతా నెలల్లో మంచు కారణంగా కార్యకలాపాలన్నీ నిలిచిపోతాయి. స్థానికులు ఆ 5 నెలల్లో సంపాదించి, దాంతోనే ఏడాదంతా బతకాలి. లద్ధాఖీ భాషలో మాట్లాడుతూ, పర్యాటకులతో అతి సౌమ్యంగా వ్యవహరించే స్థానికుల్లో... మున్ముందు కార్పొరేట్ సునామీలో తమ అస్తిత్వం కొట్టుకుపోతుందన్న ఆందోళ కనిపిస్తోంది.
"భారతదేశమన్నా, భారతీయులన్నా మాకెంతో ఇష్టం. సరిహద్దులకు పాకిస్థాన్ ముష్కరులు వస్తే.. వారిని దెబ్బతీయడంలో ఎప్పుడూ ముందుంటాం. ఇక్కడి వర్తకం, వ్యాపారం, ఆస్తులు పూర్తిగా స్థానిక తెగల చేతుల్లోనే ఉండాలి. చూసేందుకు మేము సౌమ్యంగానే కనిపిస్తాం. మా గుర్తింపు ప్రశ్నార్థకంగా మారితే మాత్రం సహించం. ఆ పరిస్థితే వస్తే లద్దాఖ్ ప్రజల తెగువ ఎలా ఉంటుందో చూస్తారు"
-లద్ధాఖ్ స్థానికులు
నేటి నుంచి మూడు రోజులపాటు పలు కార్యక్రమాలు
కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌ను పర్యాటక గమ్యస్థానంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం నుంచి మూడు రోజుల పాటు భారీ పర్యాటక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. లద్దాఖ్ ప్రాంతాన్ని సాహస, సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా మలచడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. స్థానికంగా అందుబాటులో ఉన్న పర్యాటక వనరులను పారిశ్రామిక భాగస్వాములకు పరిచయం చేయనున్నారు. దేశ, విదేశీ యాత్రల నిర్వాహకులతో ముఖాముఖి మాట్లాడి ఒప్పందాలు చేసుకోవడానికి స్థానికులకు ఒక ప్రత్యేక వేదిక కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్లు, బృంద చర్చలు, వ్యాపార సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధాకృష్ణ మాథుర్ ప్రత్యక్షంగా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారు.
ఇదీ చూడండి: 'మా సహనాన్ని పరీక్షించొద్దు'.. ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇదీ చూడండి: 'కశ్మీరీల బాధను మాటల్లో చెప్పలేం'