జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు(abolition of Kashmir special status) చేసిన తర్వాత ఆ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం రెండుగా విభజించింది. ఇవి జమ్ము కశ్మీర్, లద్దాఖ్(division of kashmir) కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి. దీంతో అక్కడి ప్రభుత్వ ఆస్తులను సమానంగా పంచాల్సిన బాధ్యత అధికారులపై పడింది. వీటితో పాటే రాష్ట్ర జంతువు, రాష్ట్ర పక్షిని ఎంపిక చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ప్రక్రియ 2019 చివర్లో ప్రారంభం కాగా.. ఎట్టకేలకు మంగళవారం ఓ కొలిక్కి వచ్చింది. రాష్ట్ర పక్షి, జంతువు వివరాలను లద్దాఖ్ యంత్రాంగం ప్రకటించింది.
స్థానికంగా ఎక్కువగా కనిపించే 'మంచు చిరుత'(snow leopard)ను రాష్ట్ర జంతువుగా ఎంపిక చేస్తున్నట్లు లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కే మాథుర్ వెల్లడించారు. ఈ మేరకు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. నల్ల మెడ కలిగిన కొంగ(black-necked crane)ను రాష్ట్ర పక్షిగా నిర్ణయించారు. ఈ పక్షులు లద్దాఖ్ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పక్షితో పాటు మంచు చిరుతలు అత్యంత అరుదైనవి. ఇవి అంతరించిపోతున్న జాబితాలో ఉన్నాయి.
పక్షి వివరాలు
- నల్ల మెడ కలిగిన కొంగ 1.35 పొడవు ఉంటుంది.
- 8 కిలోల వరకు బరువు పెరుగుతుంది.
- దీని తలపై ఎర్రటి కిరీటం లాంటి ఆకారం ఉంటుంది.
- ఎక్కువగా రెండు పక్షులు కలిసి తిరుగుతాయి.
జంతువు వివరాలు..
- మంచు చిరుత 2.4 మీటర్ల పొడవు ఉంటుంది.
- దీన్ని ఘోస్ట్ ఆఫ్ ది మౌంటెన్స్గా పిలుస్తారు.
- లద్దాఖ్‌తో పాటు ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇవి కనిపిస్తాయి.
జమ్ము కశ్మీర్ విషయానికొస్తే...
ఈ కొంగ.. ఇప్పటివరకు జమ్ము కశ్మీర్ రాష్ట్ర పక్షిగా ఉంది. కొత్త పక్షిని ఇంతవరకు ఎంపిక చేయలేదు. కశ్మీరీ దుప్పి(Kashmiri Stag)ని రాష్ట్ర జంతువుగా కొనసాగిస్తున్నారు. కశ్మీర్ దాసరిపిట్ట(Kashmir flycatcher)ను రాష్ట్ర పక్షిగా ఎంపిక చేసే యోచనలో ఉన్నారు. దీనికే తుది ఆమోదం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
జమ్ము కశ్మీర్ రాష్ట్ర వృక్షంగా చినార్, పుష్పంగా కమలం ఉన్నాయి. రాష్ట్ర పుష్పం, వృక్షంపై లద్దాఖ్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
ఇదీ చదవండి: 'ఇస్కాన్' వ్యవస్థాపకుడి స్మారకార్థం రూ.125 నాణెం విడుదల