రాజస్థాన్ డూంగర్పుర్లోని పాలీ అనే గ్రామానికి చెందిన నానారామ్ అనే వ్యక్తికి జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కూలీ పనులు చేసుకొని కాలం వెళ్లదీస్తున్న అతన్ని.. రూ.43 లక్షలు పన్ను ఎగవేతదారునిగా పేర్కొన్నారు. సుమారు రూ.24 కోట్ల విలువ చేసే డైమండ్ కంపెనీకి ఆ కూలీని యజమానిగా పేర్కొన్న వారు.. విధించిన మొత్తాన్ని తప్పనిసరిగా కట్టాలని తెలిపారు. 'సరిగా నిలువునీడ కూడా లేని నాకు జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేయడం ఏమిటని' వాపోయాడా వ్యక్తి. సాయంత్రం వరకు కష్టపడితే రూ.700 మించి సంపాదించలేని నేను.. అంత మొత్తం ఎలా కట్టాలని అన్నాడు.
అసలు విషయం ఇదే..
అధికారుల లెక్కల ప్రకారం.. నానారామ్ పేరు మీద రూ. 23.80 కోట్లు విలువ చేసే వజ్రాల వ్యాపారం ఉంది. కానీ ఈ విషయం అతనికి తెలియదు. గ్రామాల్లో జరిగే ఉపాధి హామీ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి తన విలువైన పత్రాలను అధికారులకు సమర్పించాడు. అవి చోరీకి గురయ్యాయి. వాటితో గుర్తు తెలియని వ్యక్తులు ఖాతా తెరిచి వ్యవహారం నడిపిస్తున్నారు. బోగస్ బిల్లులతో పన్ను ఎగవేతకు ప్రయత్నించారు. అయితే పత్రాల్లో ఉండే చిరునామా ప్రకారం అధికారులు నోటీసులు పంపించడంతో అసలు విషయం బయట పడింది.