జనవరిలో దేశంలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కారణం 'లా నినా'నే అని వాతావరణ శాస్త్ర నిపుణులు స్పష్టం చేశారు. మూడు దక్షిణాది రాష్ట్రాల్లో సాధారణం కంటే వెయ్యి పీడీఎన్(సాధారణ వర్షపాతం, ప్రస్తుత వర్షపాతం మధ్య వ్యత్యాసం) పాయింట్లు అధికంగా వర్షం కురిసినట్లు తెలిపారు.
ఈశాన్య రుతుపవనాలు దక్షిణాది నుంచి నిష్క్రమిస్తున్న నేపథ్యంలో 1921 తర్వాత ఈ జనవరి అత్యంత తేమతో కూడిన నెలగా రికార్డుకెక్కే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు.
తూర్పు పవనాలు బలంగా వీయడం వల్ల లానినా ప్రభావం డిసెంబర్లో తీవ్ర స్థాయికి చేరుకుందని ఏరియా సైక్లోన్ వార్నింగ్ సెంటర్ డైరెక్టర్ పువియారసన్ తెలిపారు. ఇండోనేసియాలో భూతల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందని, ఫలితంగా నీరు వేడెక్కి దక్షిణ భారతదేశంలో తేమ పెరిగిందని చెప్పారు. మరో వందేళ్లలో ఇలాంటి తేమతో కూడిన జనవరి నెల చూసే అవకాశం లేదని వెల్లడించారు.
జనవరి 1 నుంచి 16 మధ్య తమిళనాడులో అత్యధికంగా 136.3 మిల్లీమీటర్లు, కేరళలో 102.1, కర్ణాటక, ఏపీ, తెలంగాణలో 22, 15, 1.7 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. కేరళలో అత్యధికంగా 2,073 పీడీఎన్ పాయింట్లు ఎక్కువగా వర్షం కురవగా.. కర్ణాటకలో 1,365, తమిళనాడులో, 1,008, ఏపీలో 150 పాయింట్లు ఎక్కువగా వర్షం కురిసింది. తెలంగాణలో జనవరి వర్షాలు తక్కువగానే పడినట్లు తెలుస్తోంది. ఈ రాష్ట్ర పీడీఎన్ సంఖ్య మైనస్ 68గా నమోదైంది.
దక్షిణాదికి వరద ముప్పు
భవిష్యత్తులో తలెత్తే వాతావరణ మార్పుల కారణంగా దక్షిణ భారత దేశంలో వర్షపాతం తీరుతెన్నులపై గణనీయమైన ప్రభావం పడుతుందని నేచర్ క్లైమేట్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లో వరద ముప్పు పెరుగుతుందని హెచ్చరించింది. 27 వాతావరణ విధానాలను కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా విశ్లేషించి ఈ వివరాలను వెల్లడించింది. ప్రస్తుత శతాబ్దం ముగిసే వరకు గ్రీన్హౌస్ ఉద్గారాలు పెరిగితే.. వర్షపాతంలో సంభవించే మార్పులను లెక్కగట్టింది.
'ఉష్ణమండల రెయిన్ బెల్ట్' తూర్పు ఆఫ్రికా, హిందూ మహా సముద్రం వైపు నుంచి ఉత్తర దిశగా పరావర్తనం చెందున్న నేపథ్యంలో 2100 సంవత్సరానికల్లా ప్రపంచ జీవవైవిధ్యం, ఆహార భద్రతకు పెను ముప్పు కలుగుతుందని అధ్యయనం పేర్కొంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నడ్డా X రాహుల్: తారస్థాయికి మాటల యుద్ధం