Keeda Jadi cultivation : హిమాలయాల్లో దొరికే అత్యంత అరుదైన ఔషధ మూలికను కృత్రిమంగా అభివృద్ధి చేసినట్లు ప్రకటించాడు హిమాచల్ ప్రదేశ్ కుల్లూకు చెందిన గౌరవ్ శర్మ. ఇంట్లోనే చిన్నపాటి ప్రయోగశాలను ఏర్పాటు చేసి తొలిదశలో 3వేల బాక్సుల 'కీడా జడీ'ని సాగు చేసినట్లు చెప్పాడు. బెంగళూరులోని ఓ సంస్థకు ఈ సరకునంతటినీ విక్రయిస్తానని, దేశంలోని ఇతర రైతులకు కీడా జడీ సాగులో శిక్షణ ఇస్తానని తెలిపాడు.
ఏంటీ కీడా జడీ?
కీడా జడీ అనేది ఓ రకమైన అడవి పుట్టగొడుగు. సాంకేతిక నామం కార్డీసెప్స్ మిలిటారిస్. చూసేందుకు గొంగళి పురుగులా ఉంటుందని ఆంగ్లంలో క్యాటర్‌పిల్లర్ ఫంగస్ అంటారు. ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో సముద్ర మట్టానికి 3,600-5000 మీటర్ల ఎత్తులో మాత్రమే అత్యంత అరుదుగా కనిపిస్తుంది.
Himalayan Viagra benefits: కీడా జడీకి వైద్యపరంగా ఎంతో ప్రాధాన్యముంది. ఈ మూలిక.. రోగ నిరోధక శక్తిని బాగా పెంచగలదని చెబుతారు. లైంగిక సామర్థ్యాన్ని పెంచే సహజసిద్ధమైన స్టెరాయిడ్లా పనిచేస్తుందని అంటారు. అందుకే దీనిని హిమాలయన్ వయాగ్రా అని పిలుస్తారు. క్యాన్సర్‌లాంటి ప్రాణాంతక వ్యాధుల చికిత్సలోనూ కీడా జడీ ప్రభావవంతంగా పనిచేస్తుందన్నది నిపుణుల మాట. ఆయుర్వేదంలో.. శ్వాస, కిడ్నీ సంబంధిత వ్యాధుల చికిత్సలో ఈ కీడా జడీని ఉపయోగిస్తారు.
Himalayan Viagra price in India : అత్యంత అరుదుగా లభించడం, వైద్యపరంగా ప్రయోజనకారిగా పేరు ఉండడం వల్ల కీడా జడీకి గిరాకీ బాగా ఎక్కువ. ముఖ్యంగా చైనాలో ఈ మూలికకు మంచి డిమాండ్ ఉంది. విదేశీ మార్కెట్లో కీడా జడీ కిలో ధర రూ.20-25 లక్షలు ఉంటుంది. భారత్‌లో దీని గురించి పెద్దగా తెలియకపోవడం వల్ల ధర తక్కువే. దేశీయ మార్కెట్లో కిలో హిమాలయన్ వయాగ్రా రూ.3-5లక్షలు ఉంటుంది.
స్నేహితుడి సలహాతో..
How to grow keeda jadi in lab: మలేసియాలో ఉండే ఓ స్నేహితుడి ద్వారా కీడా జడీ గురించి తెలుసుకున్నాడు కుల్లూలో ఉండే గౌరవ్ శర్మ. ఆ మూలిక గురించి పూర్తిగా అధ్యయనం చేశాడు. ఇంట్లోనే ఓ ల్యాబ్ ఏర్పాటు చేసి.. ఏడాదిన్నరపాటు రకరకాల ప్రయోగాలు చేశాడు. ఎట్టకేలకు అతడి శ్రమ ఫలించింది. 45 రోజుల్లో కీడా జడీ పంట చేతికొచ్చింది. తొలి దశలో మొత్తం 3 వేల పెట్టెల సరకు అమ్మకానికి సిద్ధమైంది. బెంగళూరులోని ఓ సంస్థకు ఈ మూలికలన్నింటినీ విక్రయిస్తున్నట్లు తెలిపాడు గౌరవ్. దేశంలోని ఇతర రైతులకూ ఈ మూలిక సాగుపై శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.