KTR on Telangana Assembly Elections : రాష్ట్రంలో అక్టోబరులో ఎన్నికలు(Telangana Assembly Elections 2023) జరగకపోవచ్చని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. అక్టోబరులో రాష్ట్ర ఎన్నికలకు నోటిఫికేషన్(Telangana Assembly Elections Notification) రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. మరో ఆరు నెలల తర్వాతే తెలంగాణ ఎన్నికలు ఉండొచ్చని వివరించారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలోనే జరగొచ్చని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. దీనిపై పార్లమెంటు ప్రత్యేక సమావేశాల తర్వాత స్పష్టత రావచ్చని తెలిపారు. జమిలి ఉన్నా లేకపోయనా తనకేం లాభం లేదని స్పష్టం చేశారు. ఇవాళ ప్రగతి భవన్లో మీడియా మిత్రులతో ఆయన చిట్‌చాట్ నిర్వహించని పలు అంశాలపై స్పందించారు.
KTR on Opposition Parties : జాతీయ పార్టీలు దిల్లీ బానిస పార్టీలని కేటీఆర్ (Minister KTR)వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవమున్న తెలంగాణ ప్రజలు బానిసత్వ పార్టీలను అంగీకరించరన్నారు. దిల్లీ బానిసలు కావాలా.. తెలంగాణ బిడ్డ కావాలా రాష్ట్ర ప్రజలే తేల్చుకోవాలని స్పష్టం చేశారు. కిరణ్ కుమార్‌రెడ్డి, కేవీపీ, వైఎస్ షర్మిల(YS Sharmila) వంటి తెలంగాణ వ్యతిరేకులంతా ఏకమవుతున్నారన్నారు. పదేళ్ల అభివృద్ధిని తెలంగాణ వ్యతిరేకుల చేతులు పెడదామా..? అనేది ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి మరింత సానుకూల వాతావరణం ఉందన్నారు.
Telangana Assembly Elections in May 2024 : ఈసారి ఎన్నికల్లో 90 స్థానాలకు పైగా గెలుస్తామని.. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయి నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్ సమాచారం ప్రకారం.. కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు.
BRS MLA Candidates List 2023 : పదేళ్లలో ప్రభుత్వం అందించిన పథకాలు, సంక్షేమ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలే అద్భుతంగా వివరిస్తున్నారన్నారు. దీనిపై ప్రజలకు స్పష్టత ఉందని.. ప్రతిపక్షాలే అయోమయంలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలన.. బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. సిట్టింగ్లకు సీట్లు ఇవ్వకుంటే.. తమ దగ్గరికి వస్తారని ప్రతిపక్షాలు భావించాయని విమర్శించారు. తాను నిర్మించిన నాయకత్వం, పార్టీ నాయకులపైన తనకున్న నమ్మకం మేరకే కేసీఆర్ సిట్టింగ్ స్థానాలకు(BRS Sitting MLA Candidates) సీట్లు కేటాయించారన్నారు.
KTR on Chandrababu Arrest : ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అరెస్ట్‌పై మాట్లాడటానికి ఏమీ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. పక్క రాష్ట్రంలో జరిగే వాటిపై తాను స్పందించలేనన్నారు. అయితే తెలంగాణలో మాత్రం పూర్తి ప్రజాస్వామ్యం ఉందని తెలిపారు. ఇక్కడ పొద్దున లేచింది మొదలు సీఎంను నానా దుర్భాషలాడే ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు ఉన్నారని ఆరోపించారు. వ్యక్తిగత దూషణలు కూడా చేస్తున్నారని మండిపడ్డారు. అయినా చాలా మౌనంగా, గంభీరంగా ఉన్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఈ పరిస్థితులున్నాయా? తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎక్కువైనట్లుందని, అతి మంచితనం ఉన్నట్లుందని కొందరు మావాళ్లూ అంటున్నారని మంత్రి(KTR On AP Politics) తెలిపారు. దీనిపై తాము కూడా ఆలోచించుకోవాలన్నారు. జీ20 అనేది రొటేషన్ విధానంలో భారత్‌కు వచ్చిన ఒక అవకాశమని పేర్కొన్నారు.
ఈ నెల 21న 13,800 ఇళ్ల పంపిణీ : రాష్ట్రంలో 65 ఏళ్లలో ప్రతిపక్షాలు పెట్టిన మెడికల్ కాలేజీలు, కేవలం రెండు మాత్రమేనని ఎద్దేవా చేశారు. కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, నవోదయ పాఠశాల గానీ ఇవ్వలేదని ఆరోపించారు. ఈ నెల 15న ఒకేరోజున 9 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించబోతున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ ధాన్యం ఉత్పత్తిలోనే కాదు.. వైద్యుల తయారీలోనూ నంబర్‌వన్‌గా నిలుస్తోందని పేర్కొన్నారు. 16న కాళేశ్వరాన్ని తలదన్నేలా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నామన్నారు. అలాగే 17న జాతీయ సమైక్యత దినోత్సవం రాష్ట్రంలో ఘనంగా నిర్వహించనున్నమని చెప్పారు. వెంటనే నాలుగైదు రోజుల్లోనే హైదరాబాద్‌లో 5 ఎస్‌టీపీలను ప్రారంభించబోతున్నామని వివరించారు. 21న జీహెచ్‌ఎంసీలో 13,800 రెండు పడకల ఇళ్లను ఒకేరోజు పంపిణీ చేయనున్నామని అన్నారు. మార్కెట్ విలువ ప్రకారం.. రూ.50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల ఆస్తిని ప్రజలకు ఇవ్వనున్నామని మంత్రి స్పష్టం చేశారు.
మీ సీఎం అభ్యర్థులెవరు? : ఇతర రాష్ట్రాల్లో ఉన్న అస్థిరత, నాయకత్వ లోపం తెలంగాణలో లేదని తేల్చి చెప్పారు. తమ ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆరేనని.. ప్రతిపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో వారికే తెలియదని విమర్శించారు. దిల్లీ నుంచి వచ్చి సీల్డ్ కవర్లు, వారికి అందించే మూటలు మాత్రమే ప్రతిపక్షాల పరిస్థితి అని తెలిపారు. ముఖ్యమంత్రులను మార్చడానికి మత కల్లోలాలను లేపి, మరణహోమం సృష్టించి, మనుషులను హతమార్చిన పార్టీ కాంగ్రెస్ అని మంత్రి విమర్శలు గుప్పించారు.
తమ పార్టీ నాయకులపైననే చెప్పులు విసిరిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. తెలుగువారి గౌరవం పీవీ నరసింహారావు పైననే చెప్పులు విసిరిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. ఆత్మగౌరవం అధికంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఈ బానిసత్వ పార్టీలను అంగీకరించరని చెప్పారు. కేవీపీ రామచంద్రరావు, వైఎస్ షర్మిలలు తెలంగాణ వాదులమని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణను వ్యతిరేకించిన కేవీపీ, షర్మిలలు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తేస్తామంటున్నారని పేర్కొన్నారు. ఇంతటి దుస్థితి కాంగ్రెస్‌కి పట్టిందని విమర్శించారు. తెలంగాణ ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టలేని కిషన్‌రెడ్డి, తెలంగాణ ప్రజల పైన రైఫిల్ తీసుకువెళ్లిన రేవంత్ రెడ్డి(Revanth Reddy).. వీరు రాష్ట్ర ముసుగులో వచ్చారని ఆరోపించారు. తెలంగాణ వ్యతిరేకతను నరనరాన నింపుకొన్న కిరణ్ కుమార్‌రెడ్డి.. కేవీపీ రామచందర్రావు, షర్మిల వంటివారు ఏకమవుతున్నారని తెలిపారు. బహురూపుల వేషాల్లో తెలంగాణపైకి వస్తున్నారని మండిపడ్డారు. వీరందరితో రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు.
KTR Comments on BJP and Congress : గత ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య అవగాహన లేకపోతే.. కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంటు స్థానాల్లో పొన్నం ప్రభాకర్, మధుయాస్కీల డిపాజిట్లు పోతాయా? అని మంత్రి ప్రశ్నించారు. భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) గుజరాత్‌కు ఎందుకు పోలేదని నిలదీశారు. సోనియా, రాహుల్ గాంధీ(Rahul Gandhi)లపై ఈడీ విచారణ జరిగింది కదా.. ఆ కేసులు ఏమైనట్లు అని విమర్శించారు. అవగాహన ఉన్నది బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యేనని ఆరోపించారు. తెలంగాణలో తమ నాయకుల మీదే ఈడీ, ఐటీ దాడులు జరుగుతాయని చెప్పారు. కానీ ఒక్క కాంగ్రెస్ నాయకుడి మీద కూడా ఈ దాడులు జరిగాయని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ఎన్నెన్ని అక్రమాలు, బ్లాక్‌మెయిలింగ్‌లకు పాల్పడుతున్నారన్నది వారికి తెలియదా అని వ్యాఖ్యానించారు. మా నాయకులపై నిత్యం దాడులు చేయిస్తున్న బీజేపీ తమకు దోస్తు ఎప్పటికీ కాదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.