Bus Becomes Classroom: కేరళ రోడ్డు రవాణాసంస్థకు చెందిన ఓ డబుల్ డెక్కర్ బస్సు ప్రభుత్వ పూర్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆటపాటల తరగతి గదిగా మారిపోయింది. ఈ సంస్థ తుక్కుగా (స్క్రాప్) భావించి పక్కన పెట్టిన బస్సుల్లోంచి ఒకదానిని రెండంచెల తరగతి గదిగా తీర్చిదిద్దారు. పైభాగాన్ని చదువుకు, ఆటలకు అనువుగా మార్చారు. స్కూలుకు విరాళంగా ఇచ్చిన ఈ బస్సును మానక్కాడ్‌లోని ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ ఆవరణలో పెట్టి పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. ఇందులో టీవీ, ఏసీ, కుర్చీలు, పలు రంగుల్లో బల్లలు, బెంచీలు, పుస్తకాల అరలు అమర్చారు.
పిల్లలు బస్సు తామే నడుపుతున్నట్లుగా ఆటలాడుకునేందుకు స్టీరింగ్ చక్రం, డ్రైవరు సీటు అలాగే ఉంచేశారు. బస్సుకు రెండు వైపులా పక్షులు, జంతువులు, చెట్ల బొమ్మలు చిత్రించారు. కొవిడ్ కారణంగా రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బుధవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కాగా, పూర్వ ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఇది ఆకర్షణీయ కానుకగా మారింది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి ఆంటోనీ రాజు ప్రభుత్వ పాఠశాలకు రెండు బస్సులు సమకూర్చేందుకు మే 17న ఆమోదం తెలిపారు.
ఇవీ చూడండి: ఒక కళాశాలలో చేరిన విద్యార్థి... మరో కళాశాలలో చదువుకోవచ్చు..
బ్రిటిషర్లు రాకముందే మనం చదువుల్లో టాప్.. తెల్లవారే తెల్లబోయేలా..