Kollapur Independent Candidate Barrelakka : తెలంగాణ రాజకీయ సమరం తుది అంకానికి చేరుకుంది. ప్రచారానికి మరో ఐదు రోజులే గడువు ఉండటంతో ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరో అవకాశం కోసం అధికార బీఆర్ఎస్.. ఒక్క ఛాన్స్ అంటూ బీజేపీ, కాంగ్రెస్‌లు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. వాళ్లంతా ఒకే గూటి కింద పక్షులంటూ.. వామపక్షాలు, బీఎస్పీ వంటి పార్టీలు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇలాంటి సమయంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. ప్రజా బలంతో.. కదనరంగంలోకి అడుగుపెట్టిన తమను ఆదరించాలంటూ స్వతంత్రులు ఓట్లడుగుతున్నారు. ఇప్పటికే పలుమార్లు గెలిచిన రాజకీయ ఉద్దండులు.. ఆర్థిక, రాజకీయ అండ ఉన్న నాయకులు.. ఇలా ఇంతటి బడా నేతల మధ్య ఓ బక్కపిల్ల ఎన్నికల బరిలో దిగింది. ఆమే బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష.
Telangana Assembly Elections 2023 : నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి తాగుబోతు. చిన్నప్పుడే కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. తల్లితో కలిసి ఎన్నో కష్టాలు పడుతూ చదువుకుంది. ఓపెన్ యూనివర్శిటీలో డిగ్రీ చేసి.. గ్రూప్-1, గ్రూప్-2 ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యింది. ఎన్నోసార్లు ప్రయత్నించిన శిరీష.. ఇక తనకు ఉద్యోగం రాదంటూ.. అందుకే నాలుగు బర్రెలు కొనుక్కుని కాస్తున్నాంటూ రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యల గురించి చెబుతూ ఓ రీల్ చేసింది.
30 సెకన్లు ఉన్న ఆ రీల్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ కావడంతో శిరీష కాస్త బర్రెలక్కగా ఫేమస్ అయింది. ఆ ఫేమ్తోనే ఈసారి ఎన్నికల బరిలో నిలవాలనుకుంది. అనుకున్నదే తడవుగా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసింది. నామినేషన్ వేసిన తర్వాత పలువురి నుంచి బెదిరింపులు ఎదురైనా.. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. నిరుద్యోగుల గొంతుకగా అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న దృఢ నిశ్చయంతో ప్రచారాన్ని మొదలుపెట్టింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పంచడమే మేనిఫెస్టోగా ముందుకెళ్తోంది.
ఆఖరి ఘట్టానికి చేరుకున్న ఎన్నికల ప్రచారం-ఐదు రోజుల పాటు జాతీయ నేతల కోలాహలం
Barrelakka Election Campaign in Kollapur : తన నియోజకవర్గంలో ఉన్న సమస్యలను.. తాను ఎదుర్కొన్న ఇబ్బందులను.. ముఖ్యంగా నిరుద్యోగుల తిప్పలను ప్రజలకు వివరిస్తూ తనకు ఓటు వేయాలని అభ్యర్థిస్తోంది. తన ప్రత్యర్థులైన కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డిలను దీటుగా ఎదుర్కొంటానంటోంది. రాష్ట్ర యువత అంతా తనకు అండగా ఉన్నారని చెబుతోంది. ఈ యువతి ధైర్యానికి మెచ్చి పలువురు, పలు సంస్థలు ప్రచారానికి విరాళాలు కూడా అందజేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బర్రెలక్క ఎంతమేరకు ప్రభావం చూపుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార జోరు - మేనిఫెస్టో వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు