చిన్నప్పుడు మనమంతా చదువుకున్న ఎలుకల కథ గుర్తుందా? జర్మనీలోని హామ్లిన్ నగరంలో ఎలుకల బెడద ఎక్కువగా ఉన్నప్పుడు ఓ వాయిద్యకారుడు.. తన సంగీతగానంతో సిటీని రక్షిస్తాడు. ఇప్పుడు అతడి గురించి ఎందుకు అనుకుంటున్నారా?.. ఇప్పుడు అలాంటి లాంటి వ్యక్తి.. కోల్కతాకు అవసరమని ఆ నగరవాసులు మాట్లాడుకుంటున్నారు. అసలేమైందంటే?
బంగాల్ రాజధాని కోల్కతాలో ఎలుకల బెడద తీవ్రంగా మారింది. భూగర్భంలో నివాసం ఏర్పరచుకున్న ఎలుకలు నగరంలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. అనేక ఇళ్లల్లో బట్టలు వగైరా వస్తువులను కొరికి నాశనం చేస్తున్నాయి. దీంతో నగర ప్రజలు.. ఎలుకల వల్ల నానాపాట్లు పడుతున్నారు. అయితే కోల్కతా ప్రజలకు ఎలుకలతో పెనుముప్పు పొంచి ఉందని నగర మేయర్ ఫిర్హాద్ హకీమ్ తెలిపారు.
"చాలా మంది ప్రజలు.. వీధుల్లోనే వ్యర్థాలను పడేస్తున్నారు. రోడ్డు పక్కన ఆహార పదార్థాలను అమ్మే వ్యక్తులు కూడా చెత్తను అక్కడే పడేస్తున్నారు. వీటిని ఆహారంగా తీసుకుని ఎలుకలు జీవనం సాగిస్తున్నాయి. కాబట్టి ప్రజలు రోడ్డు పక్కన వ్యర్థాలు పారివేయకూడదు. నిర్ణీత ప్రదేశంలోనే వేయాలి. వ్యర్థాల నుంచి ఎరువు ఉత్పత్తి చేసేందుకు కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ నడుం బిగించింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం."
-ఫిర్హాద్ హకీమ్, కోల్కతా మేయర్
వంతెన స్తంభాల కింద మట్టిని..
ఎలుకలు.. వంతెన స్తంభాల కింద మట్టిని తొలిచివేస్తున్నాయని మేయర్ ఫిర్హాద్ పేర్కొన్నారు. నగరంలోని దక్షిణ భాగంలో ఉన్న ధాకురియా వంతెన ప్రస్తుత పరిస్థితిని ఉదహరించారు. ఇలాంటి ప్రధాన మౌలిక వసతుల కింద ఎలుకలు విధ్వంసం సృష్టిస్తున్నాయని ఆయన వివరించారు. ఇది ఇలాగే కొనసాగితే.. నేల కుంగిపోయే ప్రమాదం ఉందని అన్నారు.
ముఖ్యంగా నగరంలోని హల్దీరామ్, ఏజేసీ బోస్ రోడ్ వంటి ప్రాంతాల్లో ఎలుకల బెడద మరింత తీవ్రంగా ఉందని మేయర్ ఫిర్హాద్ తెలిపారు. వీటి వల్ల భవిష్యత్తులో ప్లేగు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు చెప్పారు. కాబట్టి ప్రజలంతా తప్పక జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎలుకల సంతానోత్పత్తిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సలహా ఇచ్చారు. గతంలో పైడ్ పైపర్ అనే వాయిద్యకారుడు.. తన వేణువు గానంతో హామ్లిన్ నగరాన్ని రక్షించాడని.. ఇప్పుడు కోల్కతా ప్రజలు జాగ్రత్తలతో తమ సిటీని రక్షించుకోవాలని తెలిపారు.
పైడ్ పైపర్ కథేంటి?
జర్మనీలోని హామ్లిన్ నగరంలో ఎలుకల బెడద ఎక్కువగా ఉండేది. అప్పుడు 'పైడ్ పైపర్' అనే వాయిద్యకారుడు ఎలుకలను తరిమికొట్టేందుకు సరికొత్త ఆలోచనతో ముందుకొస్తాడు. వేణువు వాయిస్తూ ఎలుకలను ముగ్ధులను చేసి.. అతడి వెంట తీసుకెళ్తాడు. అతడు నదిలో దూకగానే.. ఎలుకలు సైతం అతడిని అనుసరిస్తూ నీటిలో పడిపోతాయి. అలా ఎలుకలన్నీ నీటిలో పడి చనిపోతాయి. ఇలా ఎలుకల బారి నుంచి నగరాన్ని రక్షిస్తాడు పైడ్ పైపర్.