Tirumala Tirupati Devasthanam Alert News : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. డిసెంబర్ 19న స్వామి వారి దర్శనాన్ని నిలిపివేస్తూ.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. దర్శనాలు నిలిపివేయడానికి కారణాలు ఏంటి..? మళ్లీ ఎప్పుడు దర్శనాలు ప్రారంభమవుతాయి..? అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం: డిసెంబర్ 23న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని 19 తేదీన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామి వారి ఆలయంలో మంగళవారం రోజున ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం రోజున ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
5 గంటల పాటు దర్శనం నిలిపివేత: ఈ సందర్భంగా డిసెంబరు 19న ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్నిఅర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనంద నిలయం నుంచి ప్రారంభించి బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఆలయాన్ని శుభ్రం చేసే సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. ఆలయ శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా సంప్రోక్షణం చేస్తారు.
అష్టదళ పాదపద్మారాధన సేవ రద్దు: తరవాత స్వామి వారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా చేపడతారు. అనంతరం భక్తులను సర్వ దర్శనానికి అనుమతిస్తారు. అప్పటి వరకు స్వామి వారి దర్శనం ఉండదు. ఈ కారణంగా ఆలయంలో అష్టదళ పాదపద్మారాధన సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. కావున డిసెంబర్ 19న స్వామి వారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ఈ విషయాన్ని గమనించగలరని టీటీడీ స్పష్టం చేసింది.
10 రోజుల పాటు..: ఇదిలా ఉంటేట.. తిరుమలలో డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు, మొత్తం 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ కల్పించనుంది. దీనికి సంబంధించి టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఇప్పటికే వైకుంఠ ద్వార దర్శనానికి(Vaikunta Ekadasi 2023 Tickets) సంబంధించిన రూ.300 టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయగా.. ఆఫ్‌లైన్ టికెట్లను తిరుపతి(Tirupati)లో డిసెంబర్ 22న కౌంటర్ల ద్వారా భక్తులకు అందిస్తారు. భక్తుల సౌకర్యార్ధం తిరుపతి, తిరుమలలో 10 కేంద్రాల్లో డిసెంబర్ 22 నుంచి 4.25 లక్షల టోకెన్లను జారీ చేస్తారు. అంటే రోజుకు 42,500 చొప్పున పది రోజుల్లో మొత్తంగా 4.25 లక్షల టోకెన్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
వైకుంఠ ఏకాదశికి తిరుపతి వెళ్తున్నారా? ఈ విషయం తెలుసుకోండి - మిస్ అయితే అంతే!
శబరిమల భక్తులకు గుడ్న్యూస్- అయ్యప్ప స్వామి దర్శన సమయం పెంపు