దీపావళి అంటేనే వెలుగుల పండగ. దేశవ్యాప్తంగా ధనిక, పేద అని తేడా లేకుండా ఎంతో ఘనంగా జరుపుకునే వేడుకల్లో ఇది ప్రధానమైనది. ఇళ్లన్నీ కాంతులతో కొంత శోభను సంతరించుకునే ఈ పండగకు హిమాచల్ ప్రదేశ్లోని సమ్ము అనే గ్రామం మాత్రం వందల ఏళ్లుగా దూరంగా ఉంటోంది. దీపావళి అంటేనే ఆ గ్రామం భయపడుతోంది.
దీపావళి రోజు ఆ గ్రామంలో ఎవరూ బయటకు వెళ్లేందుకు సాహసించరు. ఇంటి ముందు దీపాలు పెట్టరు. పిండివంటలు చేసుకోరు. అలా చేస్తే.. తమ కుటుంబాలకు కీడు అని, మరణాలు సంభవిస్తాయని భావించడమే గ్రామస్థులు దీపావళి జరుపుకోకపోవడానికి కారణం.
"పండగ జరుపుకునేందుకు ప్రయత్నించిన ప్రతిసారి మరణాలు సంభవిస్తున్నాయి. ఎవరైనా అగ్నికి ఆహుతి కావడమో లేదా సామూహికంగా మృతిచెందడమో జరుగుతోంది. బంధువులను కూడా పండగకు ఆహ్వానించం. ఇంట్లోనే ఉంటాము. ఇలా చేస్తేనే మాకు ఎలాంటి అనర్థాలు జరగకుండా సురక్షితంగా ఉండగలుతాం."
-- గ్రామస్థురాలు, సమ్ము
శాపమే కారణమా?
వందల ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన ఓ మహిళ.. దీపావళి రోజే సతీసహగమనం చేసింది. భర్త అకాల మరణాన్ని తట్టుకోలేక పోయిన ఆమె అతడి చితిలో దూకి చనిపోయింది. ఇకపై గ్రామంలో ఎవరూ దీపావళి చేసుకోవద్దని ఆ సమయంలో మహిళ శపించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
ఈ శాపం నుంచి విముక్తి కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా.. ఫలితంగా లేదని వాపోయారు గ్రామస్థులు. శాపం విమోచనం కోసం ఏటా యజ్ఞాలు, యాగాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: నాలుగేళ్ల చిన్నారిని సజీవ దహనం చేసిన కిరాతకుడు