సాగు చట్టాలను రద్దు చేయకపోతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో కొనసాగడం కష్టమేనని జోస్యం చెప్పారు భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్. హరియాణా జింద్ జిల్లాలో రైతు సంఘాలు తలపెట్టిన కిసాన్ 'మహాపంచాయత్'లో మాట్లాడిన ఆయన.. ఆందోళనలు ఇలాగే కొనసాగితే అధికారం కోల్పోవడం ఖాయమని పరోక్షంగా మోదీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
"సాగు చట్టాల రద్దు అంశంపై పలుమార్లు చర్చించాం. అయినా సమస్య పరిష్కారం కాలేదు. అయితే జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని గద్దె దించాలని యువత పిలుపునిస్తే ఏమి చేస్తారు?" అని కేంద్రాన్ని ప్రశ్నించారు టికాయిత్.
దిల్లీ సరిహద్దుల్లో రహదారులపై ఇనుప ఊచలు, కాంక్రీట్‌తో నిర్మాణాలు చేపట్టడంపై టికాయిత్ విమర్శలు గుప్పించారు . "రాజు భయపడినప్పుడే కోటను భద్రపరుచుకుంటాడు" అని చురకలంటించారు.
ఐదు తీర్మానాలు
'మహాపంచాయత్'లో ఐదు తీర్మానాలు ఆమోదించారు. అవి...
- సాగు చట్టాలను రద్దు చేయాలి.
- పంటపై కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాలి.
- స్వామినాథన్ కమిషన్ నివేదిక అమలు చేయాలి.
- వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలి.
- దిల్లీ హింస తర్వాత అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాలి.
మహాపంచాయత్‌లో అపశ్రుతి
అంతకుముందు... కిసాన్ మహాపంచాయత్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. రాకేశ్ టికాయిత్ సహా ఇతర నేతలు వేదికపై ఉండగా ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. ఎక్కువమంది వేదికపై ఉండటం వల్లే ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. దీనికి గురించి ఎవరూ భయపడవద్దన్నారు టికాయిత్.