Kerala Youtubers Income Tax Raid : కేరళలో ప్రముఖ యూట్యూబర్లపై దాడులు జరిపిన ఆదాయ పన్ను శాఖ.. వీరంతా దాదాపుగా రూ.25 కోట్ల వరకు పన్ను ఎగవేసినట్లు నిర్ధరణకు వచ్చింది. గురువారం మొత్తం 13 మందిపై దాడులు చేసిన ఐటీ శాఖ.. వారి ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు జరిపింది. కేరళ వ్యాప్తంగా ఈ దాడులు జరిగాయి. భారీ స్థాయిలో పన్ను ఎగవేశారన్న ఆరోపణలతోనే ఈ దాడులు చేసినట్లు ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. దాడులు ఎదుర్కొన్న ఈ 13 మంది యూట్యూబర్‌ల జాబితాలో.. ప్రముఖ నటి పర్లీ మానేలతో పాటు సెబిన్, సాజు ముహమ్మద్ కూడా ఉన్నారు. ఈ యూట్యూబర్లందరికి లక్షల్లో సబ్‌స్ర్కైబర్లు ఉన్నారని ఐటీ శాఖ తెలిపింది. వీరికి కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తున్నప్పటికీ.. పన్నులు మాత్రం సరిగ్గా చెల్లించటం లేదని పేర్కొంది.
యూట్యూబర్‌ల సంవత్సర ఆదాయం కోటి నుంచి రెండు కోట్ల రూపాయల వరకు ఉన్న వారిపై ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. వీరిలో చాలా మంది రెండు కోట్లకు పైగా ఆదాయపన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆదాయ పన్ను శాఖ అంచనా వేసింది. యూట్యూబర్లు తమకు వస్తున్న ఆదాయానికి అనుగుణంగా పన్నులు చెల్లించటం లేదని అధికారులు తెలిపారు.
"దాడుల్లో యూట్యూబర్‌ల ఆర్థిక లావాదేవీలపైనే ప్రధానంగా దృష్టి సారించాం. చాలా మంది పన్ను ఎగవేతకు పాల్పడ్డారు. వారికి నోటీసులు జారీ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. తదుపరి చర్యల నుంచి ఉపశమనం పొందాలంటే.. చట్ట ప్రకారం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది" అని అధికారులు వెల్లడించారు. కేరళలో చాలా మంది యూట్యూబర్‌ల ఆదాయం కోట్ల రూపాయల్లో ఉందని వారు పేర్కొన్నారు.
వివాదాస్పద యూట్యూబర్ అరెస్ట్
Youtube Thoppi Arrest : కేరళలోనే 'తొప్పి' అనే వివాదాస్పద యూట్యూబర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన రూం డోర్‌ను బద్దలు కొట్టి మరీ అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఓ దుకాణం ప్రారంభోత్సవంలో.. రద్దీగా ఉండే రహదారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి, ట్రాఫిక్‌ను అడ్డగించాడన్న ఆరోపణలతో అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శుక్రవారం ఉదయం కొచ్చిలోని తన ఇంట్లో తొప్పిని పోలీసులు అరెస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో భారీగా ఫాలోవర్స్ ఉన్న 'తొప్పి'ని.. స్థానిక ప్రజా కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్నారు. 'తొప్పి' ఒరిజినల్ పేరు.. నిహాద్. వయస్సు 24 సంవత్సరాలు. వాస్తవానికి ఇతడు కన్నూరు జిల్లాకు చెందిన వ్యక్తి. 'తొప్పి' యూట్యూబ్‌లో లక్షల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. గేమింగ్ వీడియోలు చేసే అతడికి.. చిన్నపిల్లల్లో ఎక్కువ ఆదరణ ఉంది.
'తొప్పి'ని ఎన్నిసార్లు తలుపులు తీయమని చెప్పిన.. వినకపోడం వల్లే వాటిని విరగొట్టాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. దాదాపు అరగంట పాటు రూం బయటే వేచి చూసినట్లు వారు వెల్లడించారు. 'తొప్పి' తన ఫోన్లో, ల్యాప్‌టాప్‌లో ఆధారాలు ధ్వంసం చేస్తున్నట్లు తాము భయపడ్డామని.. కానీ అదేమీ జరగలేదని పోలీసులు పేర్కొన్నారు. ఆ సమయంలో 'తొప్పి' లైవ్ వీడియో చేస్తున్నాడని వారు వివరించారు.