Kerala Youth Suicide: కేరళ త్రిస్సూర్‌లో హృదయవిదారక ఘటన జరిగింది. సోదరి వివాహానికి నగలు కొనేందుకు బ్యాంకు రుణం ఇవ్వలేదని 26 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి, సోదరి నగల దుకాణంలో ఉండగా.. బ్యాంకు నుంచి డబ్బు తెస్తానని వెళ్లిన అతను లోన్ రాకపోవడం వల్ల మనస్తాపం చెంది ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుమారుడు ఇంకా రాలేదని ఇంటికి వెళ్లిన తల్లి.. అతడిని విగత జీవిగా చూసి కన్నీరుమున్నీరైంది.
త్రిస్సూర్‌లోని చెంబుక్కావుకు చెందిన ఈ యువకుడి పేరు పీవీ విపిన్. సోదరి పెళ్లికి నగలు కొనేందుకు బ్యాంకులో లోను కోసం దరఖాస్తు చేశాడు. బ్యాంకు కూడా రుణం మంజూరు చేసింది. ఆ మరునాడు తల్లి, సోదరిని నగల దుకాణానికి తీసుకెళ్లాడు. పెళ్లికి కావాల్సినవి సెలక్ట్ చేసుకోమని చెప్పి, బ్యాంకు నుంచి డబ్బు తెస్తానని వెళ్లాడు. అయితే చివరి నిమిషంలో బ్యాంకు లోన్ ఇవ్వమని చెప్పింది. దీంతో తీవ్ర మనాస్తాపం చెందిన అతడు.. తల్లికి ఆ విషయం చెప్పలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
వచ్చే ఆదివారం సోదరి పెళ్లి జరగాల్సి ఉన్న సమయంలో విపిన్ ఆత్మహత్య చేసుకోవడం కుటుంబసభ్యులను విషాదంలోకి నెట్టింది.
విపిన్ కుటుంబానికి కేవలం 3 సెంట్ల భూమి ఉందని, దానికి కోఆపరేటివ్ బ్యాంకులోగానీ, జాతీయ బ్యాంకులో గానీ రుణం రాదని పోలీసులు చెప్పారు. అందుకే ఓ ప్రైవేటు బ్యాంకును అతను ఆశ్రయించాడని తెలిపారు. వారు మొదట లోన్ ఇస్తామని చెప్పి, చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నారని పేర్కొన్నారు. బ్యాంకు అధికారులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే లోను ఎందుకు రిజెక్ట్ చేశారో చెప్పలేదు. సోమవారం ఈ ఘటన జరిగింది.
ఇదీ చదవండి: Benz car crash: ఐదు వాహనాల్ని ఢీకొట్టిన బెంజ్ కారు- ఒకరు మృతి