Kerala strange theft: కేరళ త్రిస్సూర్‌లోని ఓ దుకాణంలో ఆసక్తికరమైన చోరీ జరిగింది. ఇద్దరు దొంగలు ఓ దుకాణంలోకి చొరబడి వస్తువులను ఎత్తుకెళ్లారు. అయితే, కనిపించినవల్లా తీసుకెళ్లకుండా తమ ఇంట్లోకి కావాల్సిన సామాను మాత్రమే దోచేశారు. గ్యాస్ స్టౌ, టేబుల్ మ్యాట్లు, గొడుగు వంటి వస్తువులను తీసుకెళ్లారు. ఏమేం వస్తువులు దొంగతనం చేయాలో ముందుగానే అంచనాకు వచ్చి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది.
అనుకున్న వస్తువులన్నీ చోరీ చేశాక.. ఒక దొంగ క్యాష్ కౌంటర్ ఓపెన్ చేశాడు. అందులో ఉన్న రూ.3వేల నగదు, ఓ మొబైల్ ఫోన్‌ను తీసుకెళ్లిపోయాడు. వీరితో పాటు వచ్చిన మూడో వ్యక్తి దుకాణం బయట ఉన్నాడు. లోపలున్న దొంగలు తీసుకొచ్చిన వస్తువులను అతడు ఓ ప్యాసింజర్ ఆటోలో నింపి తీసుకెళ్లాడు. దాదాపు రూ.80వేల విలువైన సామగ్రి చోరీకి గురైనట్లు చెప్పారు.
"శనివారం ఉదయం షాప్ ఓపెన్ చేసినప్పుడు.. చాలా వస్తువులు పోయాయని తెలిసింది. సీసీటీవీ ఫుటేజీ తనిఖీ చేయగా ఇద్దరు దొంగలు కనిపించారు. స్టీల్ గిన్నెలు, ఓ కుక్కర్, గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ వంటి వస్తువులను తీసుకెళ్లారు. ఓ ఇంటికి ఏవైతే సామాను అవసరమవుతాయో వాటిని తీసుకెళ్లారు."
-విమల్, దుకాణ యజమాని
శుక్రవారం అర్ధరాత్రి తర్వాత 1.30గంటల సమయంలో చోరీ జరిగినట్లు తెలుస్తోంది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. దుకాణాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దొంగలను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇదీ చదవండి: