కేరళకు చెందిన విశ్రాంత ఎక్సైజ్ పోలీస్ అధికారి కేఎం డేవిడ్.. అత్యధిక బ్రోచర్లు (9,688) సేకరించినందుకు గిన్నిస్ రికార్డుల్లోకెక్కారు. ఒకప్పుడు డేవిడ్ బ్రోచర్లు సేకరించడాన్ని వ్యసనంగా భావిస్తూ అపహాస్యం చేసిన వారు.. ఆయన తాజాగా గిన్నిస్ రికార్డు సృష్టించడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ కథ..
కన్నూర్ జిల్లా పయ్యనూర్ గ్రామస్థుడైన కేఎం డేవిడ్.. రిటైర్డ్ ఎక్సైజ్ అధికారి. 22 ఏళ్ల కింద తన బంధువుల పిల్లల కాలేజీ అడ్మిషన్ కోసం మంగళూరు వెళ్లారు. అక్కడ ఓ కాలేజీ వారు ఆయనకు బ్రోచర్‌ను ఇచ్చారు. అప్పుడు ఆ బ్రోచర్‌ను క్షుణ్ణంగా చదవడం వల్ల డేవిడ్‌కు వాటిపైన తెలియని ఆసక్తి మొదలైంది. దీంతో ప్రతి ఇన్స్టిట్యూషన్ బ్రోచర్లు సేకరించారు.
అప్పటి నుంచి బ్రోచర్లను సేకరించడం అలవాటుగా చేసుకున్న డేవిడ్.. ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, దాదాపు 89 దేశాలకు సంబంధించిన 9,688 బ్రోచర్లను సేకరించారు. తాజాగా డేవిడ్ గిన్నిస్ రికార్డు సాధించారు. ప్రస్తుతం ఆయన ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్‌గా సేవలు అందిస్తున్నారు.
ఆ బ్రోచర్లతో తన ఇంట్లో ఓ లైబ్రరీనే తయారు చేశారు డేవిడ్. ఈ క్రమంలో ఆయనకు ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా.. ఎంత మంది తనను హేళన చేసినా అవేవీ పట్టించుకోలేదు డేవిడ్. ఈ ప్రయాణంలో బ్రోచర్ల సేకరణను కొనసాగిస్తూ.. 2017వ సంవత్సరంలో ఆసియా యూనివర్సల్ ఫోరమ్ రికార్డును సాధించారు. అంతేకాకుండా.. అదే ఏడాది గోల్డెన్ బుక్ ఆఫ్ ది రికార్డ్, ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నారు.
"నా ఆర్థిక స్థోమత, సమయాన్ని పట్టించుకోకుండా వీలైనన్ని బ్రోచర్లు సేకరించేందుకు నేను ప్రయాణాన్ని కొనసాగించాను. ఈ ప్రయాణంలో నన్ను చాలా మంది వెక్కిరించారు. కానీ ఇప్పుడు వారంతా ఆశ్చర్యపోతున్నారు. అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులు వివిధ రాష్ట్రాలు, ఆయా దేశాల్లో మంచి కాలేజీల గురించి తెలుసుకునేందుకు మా ఇంటికి వస్తున్నారు. ఒక రకంగా వారికి సహాయం చేయడం నాకు ఆనందంగా ఉంది"
- కేఎం డేవిడ్
2018లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో డేవిడ్.. తన పేరును లిఖించుకున్నారు. దీంతో యూనివర్సల్ రికార్డు ఫోరమ్‌లో స్థానం సంపాదించుకున్న ఆసియాకు చెందిన వ్యక్తుల జాబితాలో చేరారు. ఈ ఘనతలు సాధించడానికి చాలా కష్టపడ్డట్టు డేవిడ్ తెలిపారు. సేకరించిన బ్రోచర్లు విద్యార్థులకు, ఉద్యోగార్థులకు, ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికి ఎంతగానో సహాయ పడుతున్నాయని.. డేవిడ్ తెలిపారు. ఆయన వివిధ దేశాల నుంచి సేకరించిన బ్రోచర్లను అర్థం చేసుకోడానికి కొరియన్, ఆఫ్రికన్, చైనీస్, రష్యా దేశాల రాయబార కార్యాలయాలను సందర్శించినట్లు తెలిపారు. ఆయా బ్రోచర్లపై నోట్స్ కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. 2018లో జులై 15న పయ్యనూర్‌లో ప్రత్యేకంగా బ్రోచర్ల ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు.