కేరళలో కరోనా రెండో ఉద్ధృతిలో మరణాల రేటుపై ఆందోళనకర విషయాలు వెలుగుచూశాయి. గతేడాది నుంచి ఇప్పటి వరకు నమోదైన కొవిడ్ మరణాల్లో 53శాతం గత 45 రోజుల్లోనే సంభవించినట్లు తెలిసింది.
జూన్ 14 నాటికి రాష్ట్రంలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 11,342గా ఉంది. ఇందులో 3,507 మంది మే నెలలోనే మరణించడం గమనార్హం. తిరువనంతపురం జిల్లాలో అత్యధికంగా ఇప్పటి వరకు 2,401 మంది వైరస్ వల్ల చనిపోయారు.
ఇకపై పక్కా లెక్క
అయితే ఏది కొవిడ్ వల్ల జరిగిన మరణం, ఏదీ కాదో తేల్చి, సరైన సమాచారం అందించడానికి రాష్ట్ర ఆరోగ్యశాఖ కొత్త ఆన్లైన్ వ్యవస్థను రూపొందించింది. ఇది జూన్ 16న అందుబాటులోకి రానుంది.
"కరోనా రోగులకు వైద్యం అందించే ఆసుపత్రిలోని వైద్యులు, సూపరిండెంట్.. మరణాలపై ప్రత్యేక బులెటిన్‌ను విడుదల చేయాలి. దీన్ని జిల్లా వైద్యాధికారి పర్యవేక్షించాలి" అని ప్రభుత్వం పేర్కొంది.
ఏ దేశంలో నమోదవ్వని విధంగా..
కరోనా మహమ్మారి కర్కశత్వానికి ఈ ఏడాది మే నెలలో భారత్‌లో రోజుకు వేల సంఖ్యలో రోగులు కన్నుమూశారు. ప్రపంచంలోని ఏ దేశంలో నమోదవ్వని విధంగా భారత్‌లో రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు, మరణాలు నమోదయ్యాయి. దేశంలో గంటకు సగటున 165 మందిని కరోనా పొట్టన పెట్టుకుంది. మే నెలలో దేశంలో రికార్డు స్థాయిలో 90 లక్షల 30 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఒక నెలలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవ్వలేదు. ఏప్రిల్ నెలలో దేశంలో 69.4 లక్షల మంది కరోనా బారినపడగా దానికంటే 30 శాతం అధికంగా మేలో కేసులు వెలుగుచూశాయి.
ఇదీ చదవండి: Corona Death: గంటకు 165 మంది బలి!
ఇదీ చదవండి: Delta Plus: కరోనాలో కొత్త వేరియంట్!