కేరళలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటం సహా వివిధ ఘటనల్లో ఇప్పటివరకు 21 మంది మరణించారు. పలువురు గల్లంతయ్యారు.
వీరిని వెతికేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణా యంత్రాంగం(కేఎస్డీఎంఏ) సహా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సహాయక చర్యలను చేపట్టేందుకు 11 టీంలను రంగంలోకి దించింది కేంద్రం. సైన్యం కూడా ఇందులో భాగమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారిని రక్షించేందుకు.. హెలికాప్టర్లను ఉపయోగిస్తోంది.
ఒక్కచోటే 13 మంది..
కొట్టాయం జిల్లా కూట్టిక్కల్లో భారీ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఒక్కచోటే 13 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఇడుక్కిలో మరో 8 మంది చనిపోయారు.
భారీ వానల నేపథ్యంలో.. అక్కడి పరిస్థితులపై రాష్ట్ర మంత్రులు కె.రాజన్, రోషీ, వాసవన్ సమీక్ష నిర్వహించారు.
ఎర్నాకుళంలోనూ వర్షాలకు.. మువత్తుపుళా నదిలోకి నీరు భారీగా వచ్చి చేరింది. ఆదివారం కూడా రాష్ట్రానికి భారీ వర్షసూచన ఉన్నట్లు పేర్కొంది భారత వాతావరణ శాఖ. తిరువనంతపురం, కొల్లం, ఎర్నాకుళం సహా మొత్తం 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
అండంగా కేంద్రం..
వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళకు కేంద్రం అండగా ఉంటుందన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. రాష్ట్రంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో.. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు ముఖ్యమంత్రి పినరయి విజయన్. బాధితుల పునరావాసం కోసం 105 శిబిరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
అల్పపీడనం..
కేరళ వద్ద ఆగ్నేయ అరేబియా సముద్రతీరాన ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాలు నీటమునిగాయి. నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ప్రజలు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.