కేరళలో సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి పినరయి విజయన్. రాత్రి 10గంటల నుంచి ఉదయం 6వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. వీక్లీ ఇన్ఫెక్షన్ పాపులేషన్ రేషియో 7శాతం కన్నా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ విధిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజూ కరోనా కేసులు 30వేల మార్కును దాటాయి. శనివారం 1,67,497 శాంపిళ్లను పరీక్షంచగా కొత్తగా 31,265 మంది కరోనా బారిన పడినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 39,77,572కి చేరింది. మరో 153 మంది చనిపోయారు.
తగ్గిన పాజిటివిటీ రేటు..
టెస్టు పాజిటివిటీ రేటు మాత్రం శుక్రవారంతో పోలిస్తే కాస్త తగ్గింది. ఆగస్టు 27న టీపీఆర్ 19.22 ఉండగా, శనివారం 18.67గా నమోదైంది.
కేరళలో మాత్రమే..
లక్షకు పైగా యాక్టివ్ కేసులున్న రాష్ట్రం కేరళ మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరో నాలుగు రాష్ట్రాల్లో 10 వేల నుంచి లక్ష మధ్యలో క్రియాశీల కేసులున్నట్లు వెల్లడించింది.
జులైలో రెండు పండగల కోసం ఆంక్షలను సడలించిన నాటి నుంచి కేరళలో మరోసారి వైరస్ విజృంభిస్తోంది. వ్యాధిని అదుపు చేయడానికి ఇప్పటికే ఆదివారాలు లాక్డౌన్ విధిస్తోంది కేరళ.
ఇదీ చూడండి: Corona cases: దేశంలో మరో 46వేల కరోనా కేసులు!