Pinarayi Vijayan US visit: అమెరికాకు చికిత్స కోసం వెళ్లిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. కొంతకాలం అక్కడి నుంచే పాలన సాగిస్తానని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాదిరిగా పాలనాబాధ్యతలను వేరే వ్యక్తికి అప్పగించబోనని చెప్పారు. ప్రభుత్వాన్ని నడిపేందుకు సాంకేతికతను ఉపయోగించుకుంటానని వెల్లడించారు.
Pinarayi Vijayan Joe Biden
వైద్య చికిత్స కోసం తన భార్య, వ్యక్తిగత సిబ్బందితో కలిసి అమెరికా వెళ్లారు విజయన్. జనవరి 29న తిరిగి వస్తారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశానికీ వర్చువల్ పద్ధతిలో హాజరయ్యారు విజయన్. జనవరి 19న మరో కేబినెట్ భేటీ ఉంటుందని చెప్పారు. ఆస్పత్రి బెడ్‌పై నుంచీ పని చేస్తానని ఈ మేరకు సూచనప్రాయంగా తెలిపారు.
2018లో వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లినప్పుడు ఈపీ జయరాజన్‌కు బాధ్యతలు అప్పగించారు ముఖ్యమంత్రి విజయన్. కేబినెట్లో సీఎం తర్వాతి స్థానం ఆయనదేనని అప్పట్లో చెప్పుకునేవారు. ఈసారి... సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులైన ఎంవీ గోవిందన్, కే రాధాకృష్ణన్‌కు బాధ్యతలు అప్పగిస్తారని అంతా భావించారు. అయితే, కేబినెట్ భేటీ ప్రకటనతో ఈ ఊహాగానాలకు విజయన్ ఫుల్ స్టాప్ పెట్టారు.
అమెరికా నుంచి సీఎం పాలన సాగించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగానే ఉన్నాయి. రహస్య పత్రాలను చూసేందుకు రాష్ట్ర సెక్రెటేరియట్ పటిష్ఠ సాంకేతికతను వినియోగిస్తోంది. సరైన ఐడీ, పాస్వర్డ్ ద్వారా ఎక్కడి నుంచైనా లాగిన్ అయ్యి.. ఫైల్స్ వీక్షించే సదుపాయం కల్పిస్తోంది.
బైడెన్ ఏం చేశారంటే...
గతేడాది నవంబర్‌లో కొద్ది నిమిషాల పాటు అధ్యక్ష బాధ్యతలను ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు బదిలీ చేశారు జో బైడెన్. కొలనోస్కోపీ పరీక్ష కోసం వైద్యులు.. బైడెన్‌కు మత్తు మందులు ఇచ్చారు. అమెరికా నిబంధనల ప్రకారం అధ్యక్షుడు స్పృహలో లేని పక్షంలో ఉపాధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తికి అధ్యక్ష బాధ్యతలు వెళతాయి. స్పృహలోకి వచ్చాక ఆ బాధ్యతలన్నీ మళ్లీ అధ్యక్షుడి వశమవుతాయి.
ఇదీ చదవండి: సొంత ఇలాఖా నుంచే యోగి పోటీ- అఖిలేశ్ సెటైర్