కేరళ మలప్పురం జిల్లాలో ప్రమాదానికి గురైన పడవ యజమాని నాసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన తర్వాతి నుంచి పరారీలో ఉన్న అతడిని.. కోజికోడ్‌లో అరెస్ట్ చేశారు. నాసర్ స్వస్థలం మలప్పురంలోని తనూర్ కాగా.. ప్రమాతం అనంతరం కోజికోడ్‌లోని ఎలాతూర్లో అతడు తలదాచుకున్నాడని పోలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం అతడిని అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేశారు. కొచ్చిలో అతడి కారును సీజ్ చేసినట్లు చెప్పారు. నాసర్ సోదరుడిని సోమవారం ఉదయమే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా నాసర్‌ను పట్టుకున్నట్లు వివరించారు.
నిబంధనల ఉల్లంఘన వల్లే పడవ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన పడవకు లైసెన్స్ లేదని తేలింది. నిజానికి ఆ పడవను చేపలు పట్టేందుకు వినియోగించేవారు. నాసర్.. దానికి కొన్ని మార్పులు చేసి టూరిజం కోసం వినియోగించడం ప్రారంభించాడు. అనుమతి లేని సమయంలో పడవలో ప్రయాణికులను తిప్పారు. చాలా మంది ప్రయాణికులు లైఫ్ జాకెట్లు ధరించలేదు. పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం కూడా ప్రమాదానికి కారణమని సమాచారం.
రూ.10 లక్షల పరిహారం..
ఇదిలా ఉండగా.. పడవ ప్రమాద ఘటనపై పినరయి విజయన్ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. తిరురంగడి ఆస్పత్రికి చేరుకున్న విజయన్.. బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 10లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. పడవ ప్రమాదంలో చనిపోయినవారికి సంఘీభావంగా కేరళ ప్రభుత్వం ఇవాళ సంతాపదినం ప్రకటించింది. అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దయ్యాయి.
పడవ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కుటుంబానికి చెందిన 12 దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నట్లు ఆటోడ్రైవర్ షాహుల్ హమీద్ తెలిపారు. తన ఆటోలో కొంత మంది పిల్లలను సమీప ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. అందులో కొందరు తన కుటుంబసభ్యులు కూడా ఉన్న విషయం తెలియదని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో తన సోదరి, ఆమె ముగ్గురు పిల్లలుసహా మెుత్తం 12 మంది మరణించారని ఆటో డ్రైవర్ షాహుల్ హమీద్ కన్నీరుమున్నీరయ్యారు.
మలప్పురం జిల్లా తనూర్ ప్రాంతంలోని తువల్ తీరం బీచ్‌లో ఆదివారం రాత్రి పడవ ప్రమాద జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 30 మందికి పైగా ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వారిలో 22 మంది మృతి చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. ఐదుగురు ఈదుకుంటూ ఒడ్డుకు చేరగా... మరో 8 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో విహారయాత్రకు వచ్చి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.