కేంద్ర ప్రభుత్వ టీకా విధానంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాదాపు ప్రతిరోజు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. టీకా పంపిణీ సరిగా జరగడం లేదని, రాష్ట్రానికి వ్యాక్సిన్ కొనుగోలు బాధ్యతలు అప్పగించడం సరికాదని కేంద్రానికి చురకలు అంటిస్తున్నారు. టీకా కొరతను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్.. కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డారు. వ్యాక్సినేషన్ ఎలా చేపట్టాలో తమను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.
అసలేమైందంటే?
టీకా కొరత నేపథ్యంలో 18-44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేస్తూ దిల్లీ సర్కారు నిర్ణయం తీసుకుంది. టీకా లభ్యత పెరిగేంత వరకు తాత్కాలికంగా ఈ వయస్కుల వారికి పంపిణీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నిర్ణయంపై స్పందించిన హరియాణా సీఎం ఖట్టర్.. ఇదంతా ఓ నాటకమని ధ్వజమెత్తారు. టీకా పంపిణీని సమర్థంగా చేపట్టాలని హితవు పలికారు. దిల్లీకి అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ టీకాలు వస్తున్నాయని.. వాటిని సరిగ్గా వినియోగించుకోవాలని సూచించారు.
"రోజుకు 2 లక్షల మందికి డోసులు అందించి టీకా నిల్వలను మేము కూడా అయిపోయేలా చేయగలం. కానీ ప్రతిరోజు 50 నుంచి 60 వేల మందికే వ్యాక్సిన్లు అందించి.. టీకా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇలా చేస్తేనే వ్యాక్సినేషన్ సాఫీగా సాగుతుంది. కాబట్టి, కేజ్రీవాల్ దీన్ని పాటించాలి" అంటూ హితబోధ చేశారు ఖట్టర్.
కేజ్రీ సమాధానం..
అయితే, ఖట్టర్ వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చారు దిల్లీ సీఎం కేజ్రీవాల్. తమ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడాలనుకుంటోందని, టీకాలను కాదని చురకలు అంటించారు.
"ఖట్టర్ సాబ్, టీకాలు మాత్రమే ప్రజల ప్రాణాలు కాపాడతాయి. వ్యాక్సినేషన్ ఎంత త్వరగా పూర్తి చేస్తే అన్ని ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి. మా లక్ష్యం టీకాలను కాపాడుకోవడం కాదు.. ప్రాణాలను రక్షించుకోవడం."
-కేజ్రీవాల్ ట్వీట్
వచ్చే మూడు నెలల్లో అందరికీ టీకాలు అందించాలంటే దిల్లీకి నెలకు 80 లక్షల డోసులు అవసరమవుతాయని కేజ్రీవాల్ చెబుతున్నారు. మే నెలలో 16 లక్షల డోసులు మాత్రమే అందాయని, వచ్చే నెలకు 8 లక్షలు మాత్రమే కేటాయించారని తెలిపారు. ఈ వేగంతో వ్యాక్సినేషన్ కొనసాగిస్తే యువత అందరికీ టీకా ఇచ్చేందుకు రెండున్నరేళ్లు పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి-
Unlock: 'క్రమంగా లాక్డౌన్ ఎత్తివేత'