మొబైల్‌ఫోన్ల వల్లే అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నాయని ఉత్తర్‌ప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు మీనాకుమారి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. అలీగఢ్ జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
"అమ్మాయిలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకూడదు. వారంతా అబ్బాయిలతో గంటల తరబడి ఫోన్లలో మాట్లాడి.. సాన్నిహిత్యం ఏర్పడ్డాక అబ్బాయిలతో వెళ్లిపోతున్నారు. ఈ విషయాలేవీ అమ్మాయిల కుటుంబసభ్యులకు తెలియవు. కనీసం వారు వాళ్ల ఫోన్లను చెక్ చేయరు. మహిళలపై జరుగుతున్న నేరాల గురించి సమాజం తీవ్రంగా ఆలోచించాలి. అలాగే తల్లిదండ్రులు.. ముఖ్యంగా తల్లులు ఇంట్లో వారి కుమార్తెలను కనిపెట్టుకుని ఉండాలి" అని ఆమె పేర్కొన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలను మహిళా కమిషన్ వైస్ ఛైర్‌పర్సెన్ అనూజ్ చౌదరి ఖండించారు. పిల్లల నుంచి సెల్‌ఫోన్లు తీసుకున్నంత మాత్రాన అత్యాచారాలకు అడ్డుకట్ట వేయలేమని పేర్కొన్నారు.
ఈ ఏడాది జనవరిలో బదౌన్ ప్రాంతంలో జరిగిన ఓ అత్యాచార ఘటనపై స్పందిస్తూ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు చంద్రముఖి దేవి కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. 'అమ్మాయిలు సాయంకాలం బయటికి వెళ్లకపోతే అత్యాచారాలు జరగవు" అని అన్నారు. అయితే దీనిపై తీవ్ర దుమారం రేగడంతో ఆమె తన వ్యాఖ్యలను వెనక్కితీసుకున్నారు.
ఇదీ చూడండి: కరోనాను జయించి ఎవరెస్టును అధిరోహించిన సాహసి