Kedarnath Pilgrims Death : ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌లో కారుపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు యాత్రికులు మరణించారు. వీరందరూ కేదారినాథ్ యాత్రకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. శిథిలాలను తొలగిస్తుండగా మృతదేహాలు కనిపించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదం గురువారం సాయంత్రం జరిగిందని.. మృతుల్లో ఒకరు గుజరాత్‌కు చెందినవారని చెప్పారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
Rudraprayag Landslide Today : తర్సాలి ప్రాంతంలోని గుప్తకాశి-గౌరీకుండ్ జాతీయ రహదారి సమీపంలో కొండచరియలు విరిగిపడటం వల్ల 60 మీటర్ల మేర రోడ్డు కొట్టుకుపోయింది. ఆ సమయంలో కేదార్‌నాథ్ వెళ్తున్న యాత్రికుల కారుపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీనిపై సమాచారం అందుకున్న రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. తీవ్రంగా ధ్వంసమైన కారు నుంచి ఐదు మృతదేహాలను వెలికితీశారు.
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి పర్యటించారు. ఈ మేరకు బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. భారత వాతావరణ సంస్థ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రానున్న మూడురోజులకు 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. ఇక ఈ వర్షాకాలం ప్రారంభమైన నుంచి ఇప్పటివరకు వేర్వేరు ఘటనల్లో 58 మంది ప్రాణాలు కోల్పోయారని, 37 మంది గాయపడ్డారని, 19 మంది అదృశ్యమయ్యారని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే ఆదివారం వరకు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మరో రెండు మృతదేహాలు వెలికితీత.. కొనసాగుతున్న ఆపరేషన్
Uttarakhand Landslide News : ఉత్తరాఖండ్.. రుద్రప్రయాగ్ జిల్లాలో భారీ వర్షాల ధాటికి ఆగస్టు 3వ తేదీన కొండచరియలు విరిగిపడి మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో 23 మంది గల్లంతయ్యారు. అప్పటి నుంచి వారి కోసం రెస్క్యూ బృందం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. శనివారం ఉదయం రెండు మృతదేహాలను వెలికితీశాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం 7 మృతదేహాలను గుర్తించాయి. మరో 16 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.