KBC season 14 1 crore winner : బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పాపులర్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' సీజన్ 14లో విజేతగా నిలిచారు ఓ గృహిణి. మహారాష్ట్ర కొల్హాపుర్ జిల్లా గాంధీనగర్‌కు చెందిన కవితా చావ్లా కేబీసీలో రూ.కోటి గెలుచుకున్నారు. ఈ విజయం వెనుక 22 ఏళ్ల నిరీక్షణ, శ్రమ ఉన్నట్లు ఈటీవీ భారత్‌తో చెప్పారు కవిత.
ఉక్కు సంకల్పంతో..
KBC 14 winner Kavita Chawla : కవితా చావ్లా 12వ తరగతితో చదువు ఆపేశారు. వస్త్ర వ్యాపారం చేసే విజయ్ చావ్లాతో ఆమెకు వివాహమైంది. అప్పటి నుంచి ఇంటి పనులకే పరిమితం అయ్యారు కవిత. అయితే.. 22 ఏళ్ల క్రితం ప్రారంభమైన కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమం ఆమెను ఎంతగానో ఆకట్టుకుంది. ఎలాగైనా ఆ షోలో పాల్గొనాలని, విజేతగా నిలవాలని కలలుగన్నారు కవిత. అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రోజూ ఇంటి పనులు పూర్తయ్యాక.. కేబీసీ కోసం సమయం కేటాయించేవారు. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌పై అవగాహన పెంచుకునేవారు.
2013లో తన కల దాదాపు నెరవేరిందని అనుకున్నారు కవిత. అప్పట్లో కేబీసీ టాప్-10కు ఆమె ఎంపిక అయ్యారు. కానీ.. హాట్ సీట్ వరకు వెళ్లకుండానే వెనుదిరిగారు. అయినా ఏమాత్రం నిరాశ చెందలేదు కవిత. తన ప్రయత్నాల్ని కొనసాగించారు. ఎట్టకేలకు సీజన్-14లో హాట్ సీట్ వరకు వెళ్లారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి.. రూ.కోటి గెలుచుకున్నారు. కవితా చావ్లా పాల్గొన్న ఎపిసోడ్.. సోమ, మంగళవారాల్లో ప్రసారం అవుతోంది.
22 ఏళ్ల సాకారంతో అంతులేని ఆనందంతో మునిగిపోయింది కవితా చావ్లా కుటుంబం. షూటింగ్ నుంచి ఆమె తిరిగి వచ్చే సమయానికి.. బ్యాండ్ వాయిస్తూ, టపాసులు పేల్చుతూ సంబరాలు చేసుకుంది. "ప్రయత్నించే వారు ఎప్పటికీ ఓడిపోరు అని నిరూపితమైంది. రూ.కోటి గెలవడంకన్నా.. హాట్ సీట్లో అమితాబ్ బచ్చన్ ముందు కూర్చోవడం మర్చిపోలేని అనుభూతి" అని అన్నారు కవిత. కేబీసీ ద్వారా వచ్చిన డబ్బును.. తన భర్త వ్యాపారం కోసం తీసుకున్న అప్పులు తీర్చేందుకు, కుమారుడు బ్రిటన్ వెళ్లి చదువుకునేందుకు ఖర్చు చేస్తామని చెప్పారు.