జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా పాల ఉత్పత్తికి పెట్టింది పేరు. అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసి ఆనంద్ ఆఫ్ కశ్మీర్‌గా పేరొందిన ఈ జిల్లాలో.. పాల ఉత్పత్తి దారులు, వినియోగదారుల సౌలభ్యంకోసం మొదటిసారిగా పాల ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. ఇదే జిల్లాకు చెందిన పాల సరఫరాదారు షబీర్ అహ్మద్ వాగె.. పశుసంవర్ధకశాఖ సహకారంతో ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు. ఈ ఏటీఎం తయారీకి 50శాతం సబ్సిడీ లభించింది. యంత్రంలో సుమారు 500 లీటర్ల పాలను 3 రోజుల పాటు నిల్వ ఉంచవచ్చు. ఈ యంత్రం పాలను 4 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచుతుంది. కార్డు ఉపయోగించి పాలను తీసుకోవచ్చు.
పశుసంవర్ధకశాఖ అధికారుల సహాయంతోనే ఈ యంత్రం ఏర్పాటు సాధ్యమైందని షబీర్ అన్నారు. ఇందుకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
''ఏటీఎం తయారీదారు, పశుసంవర్ధక శాఖ సహాయంతో నేను ఈ పాల ఏటీఎంను ఏర్పాటు చేశాను. ప్రజలకు సులువుగా పాలు అందించేందుకు దీన్ని ఏర్పాటు చేశాను. మూడో రోజుల పాటు పాలు తాజాగా ఉంటాయి.''
-షబీర్ అహ్మద్ వాగె, మిల్క్ ఏటీఎం ఏర్పాటుదారు
యువకులను ప్రోత్సహించేందుకు తాము ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నామని.. పశుసంవర్ధక శాఖ అధికారులు చెప్పారు. ఈ తరహా ఏటీఎం యంత్రాలను జిల్లాలో ఇతర ప్రాంతాల్లోనూ నెలకొల్పా లని ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
''ఈ యంత్రం ఏర్పాటుకు సహాయం చేయమని షబీర్ అహ్మద్ వాగే మమ్మల్ని సంప్రదించారు. ఇంటిగ్రేటెడ్ డెయిరీ డెవలప్మెంట్ స్కీమ్ కింద 50శాతం సబ్సీడి ఇచ్చాం. దీని ద్వారా పాల మార్కెట్ పెరుగుతుంది.''
-డా.మహమ్మద్ హుస్సేన్ వాని, పుల్వామా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి
ఇవీ చదవండి: రేషన్ బియ్యం ఏటీఎంలు.. ప్రయోగాత్మకంగా అమలు