Kashmir pandits massacre: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కశ్మీరీ పండిట్ల ఊచకోత ఘటనలు కశ్మీర్‌లోని పలు చోట్ల జరిగాయి. ద కశ్మీర్ ఫైల్స్ చిత్రంతో కశ్మీరీ పండిట్ల ఊచకోత అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అలాంటి ఒక గ్రామాన్ని ఈటీవీ భారత్ సందర్శించింది. పుల్వామా జిల్లా షోపియాన్‌కు సమీపంలోని నడిమార్గ్ గ్రామంలో 2003 మార్చి 23న రాత్రి 11గంటల ప్రాంతంలో సైనిక దుస్తుల్లో వచ్చిన లష్కరే తొయిబాకు చెందిన ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. 24మంది కశ్మీరీ పండిట్లను విచక్షణారహితంగా తుపాకీతో కాల్చిచంపారు. వారిలో 11మంది పురుషులు, 11 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతుల్లో 65ఏళ్ల వృద్ధులు మొదలుకొని రెండేళ్ల చిన్నారులు ఉన్నారు. ఎంపిక చేసిన కశ్మీరీ పండిట్లను ఇళ్ల నుంచి బయటకు లాక్కొచ్చి.. వరుసగా నిలబెట్టి ఉగ్రవాదులు కిరాతంగా కాల్చిచంపారు. కొంతమంది స్థానికులు కూడా ఉగ్రవాదులకు సహకరించారు. మృతదేహాలను గుర్తు పట్టనంత దారుణంగా ఛిద్రం చేసిన ముష్కరులు కశ్మీరీ పండిట్ల ఇళ్లను లూఠీ చేశారు. చివరకు మహిళల మృతదేహాలపై ఉన్న ఆభరణాలను కూడా ఎత్తుకెళ్లారు.
ఈ ఘటన జరిగి దాదాపు 2 దశాబ్దాలు కావస్తోంది. ఆ మారణకాండతో హడలిపోయిన కశ్మీరీ కుటుంబాలు.. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని కశ్మీర్‌ను వీడిపోయాయి. సొంత ఇళ్లు, భూములు, ఆస్తిపాస్తులన్నీ వదులకొని నిరాశ్రయులుగా ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డాయి. ఆనాటి దుర్ఘటనపై స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. కశ్మీరీ పండిట్లు తమ స్వస్థలాలకు తిరిగి రావాలని కోరుతున్నారు. హిందూ-ముస్లిం అనే భేదభావం లేకుండా తామంతా కలిసిమెలిసి జీవించే వారమని గుర్తుచేసుకుంటున్నారు. కశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం నెలకొనాలని అక్కడి ముస్లింలు నౌరూజ్ ఆలం పండుగ సందర్భంగా అల్లాను ప్రార్థించారు. మళ్లీ ఆ పాత రోజులు రావాలని కోరుతున్నారు.
" అప్పుడు పండిట్లను ఎవరు చంపారో తెలియదు. చీకటిగా ఉంది. నేను శ్రీనగర్‌లో కూలీ పని చేసేవాడిని. ఆనాటి ఘటనపై అందరికీ బాధగానే ఉంది. పండిట్లు తమ స్వస్థలాలకు మళ్లీ తిరిగి రావాలని కోరుతున్నాం. కశ్మీర్‌లో ఏం జరుగుతుందో తెలియదు. వారిని ఎవరు చంపారో కూడా తెలియదు. నిజమేమంటే హిందూ-ముస్లింలు ఒక్కటే. ఈ భూములన్నీ వారివే. వారి భూముల్లో సేద్యం చేసుకొని తింటున్నామనుకోండి."
- బిలాల్ అహ్మద్, స్థానికుడు
ఇదీ చూడండి: కశ్మీరీ పండిట్ల కన్నీటి గాథ.. 'ది కశ్మీర్ ఫైల్స్'