కర్ణాటకకు చెందిన భరత్ (29) అనే యువకుడు.. తన మొదటి ప్రయత్నంలోనే టెలిస్కోప్ తయారు చేశాడు. ఖగోళశాస్త్రం మీద ఆసక్తితో, పలు పుస్తకాల సాయంతో భరత్.. కేవలం రూ.20 వేల ఖర్చుతో ఈ టెలిస్కోప్‌ను సిద్ధం చేశాడు. సొంతంగా చేసిన టెలిస్కోప్‌ను ఉపయోగించి సౌరవ్యవస్థలోని గ్రహాలను పరిశీలిస్తున్నట్లు భరత్ తెలిపాడు.
ఇదీ కథ..
29 ఏళ్ల భరత్ కర్ణాటక చామరాజనగర్ నివాసి. భరత్ డిప్లొమాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అయితే అతడికి ఆకాశంలో వివిధ గ్రహాలను పరిశీలించడం అంటే చాలా ఇష్టం. అయితే ఇందుకోసం టెలిస్కోప్‌ను కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేదు. దీంతో స్వయంగా టెలిస్కోప్ తయారు చేసేందుకు సిద్ధమయ్యాడు. అనేక పుస్తకాలు చదివి తానే సొంతంగా ఈ పరికరాన్ని తయారు చేశాడు. ఈ టెలిస్కోప్‌తో ఇంటి నుంచే సౌరవ్యవస్థను పరిశీలిస్తున్నట్లు భరత్ చెబుతున్నాడు.
పీ.ఎన్ శంకర్ అనే రచయిత రాసిన 'హౌ టు బిల్డ్ ఏ టెలిస్కోప్' పుస్తకాన్ని చదివి, అనేక మంది సలహాలతో తొలి ప్రయత్నంలోనే టెలిస్కోప్‌ను తయారు చేసినట్టు భరత్ తెలిపాడు. కొవిడ్ సెకండ్ వేవ్ సమయాన్ని ఉపయోగించుకొని ఇందుకోసం పరిశోధనలు చేసినట్లు తెలిపాడు. ఈ టెలిస్కోప్‌ను కేవలం 50 గంటల్లోనే తయారు చేశానని అన్నాడు. 8 అంగుళాల వ్యాసంగల అద్దం, 8.1 ఫోకల్ రేషియో, 1660 మి.మీ ఫోకల్ లెంగ్త్‌తో కూడిన ఈ టెలిస్కోప్‌ను.. లోకల్ మెటీరియల్‌ను ఉపయోగించి కేవలం రూ. 20 వేలతో తయారుచేసినట్టు భరత్ పేర్కొన్నాడు. సాధారణంగా ఈ రకం టెలిస్కోప్ మార్కెట్లో రూ. 70- 80 వేల వరకు ధర పలుకుతుందని చెప్పాడు.
ఈ టెలిస్కోప్‌తో భరత్.. ఇంటి నుంచే గ్రహాలు, ఉప గ్రహాలు, చంద్రగ్రహణాలను పరిశీలించడమే కాకుండా.. చుట్టు పక్కల వారికి, కాలనీ పిల్లలకు కూడా సౌరవ్యవస్థపై అవగాహన పెంచుతున్నాడు. సౌరవ్యవస్థలోని బృహస్పతి, నక్షత్రాలు, చంద్రుడిని పరిశీలించడానికి భరత్ తన ఇల్లును ఒక ప్రయోగశాలగా మార్చేశాడు. భరత్ 8వ తరగతిలో ఉన్నప్పుడే.. టెలిస్కోప్ పట్ల మక్కువ పెంచుకున్నాడు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మైసూర్ పర్యటనకు వచ్చినప్పుడు ఒక చిన్న టెలిస్కోప్ తయారు చేసి ఆయన ముందు ప్రదర్శించినట్లు గుర్తు చేసుకున్నాడు.
"టెలిస్కోప్ మేకర్స్ అనే ఫేస్బుక్ పేజ్ ద్వారా, కొంతమంది నిపుణులను ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి సలహాలు పొందాను. అలాగే చాలా పుస్తకాలను కూడా చదివా. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించినందుకు చాలా హ్యాపీగా ఫీలవుతున్నా."
- భరత్, టెలిస్కోప్ రూపకర్త
కుమారుడు సాధించిన ఈ ఘనతకు భరత్ తల్లి నిర్మల సంతోషం వ్యక్తం చేశారు. 'పెళ్లిలో సంప్రదాయం ప్రకారం అరుంధతి నక్షత్రం చూపిస్తారు. కానీ నా కుమారుడు తన అద్భుతమైన ఆవిష్కరణతో నాకు నిజమైన నక్షత్రాలు చూపించాడు. అందరు పిల్లలు ఈ వయసులో ఆటలు ఆడుకుంటే.. నా కుమారుడు సైన్స్‌తో ఆడుకోవడం సంతోషంగా ఉంది. తను ఇలాంటి ఆవిష్కరణలు ఇంకా ఎన్నో చేయాలి' అని భరత్ తల్లి అన్నారు.