నాణేల సేకరణకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కొందరు కొన్నింటిని సేకరించి వదిలేస్తుంటారు. కానీ, కర్ణాటకకు చెందిన ఓ యువకుడు నాణేల సేకరణతో 'వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియా'లో చోటు సంపాదించాడు.
ఈ నాణేల సేకరణను మూడేళ్ల క్రితం తన హాబీగా మార్చుకున్నాడు ఉత్తర కన్నడ జిల్లా షెజ్వాద్ ప్రాంతానికి చెందిన వసుదేవ అనంత్ హర్చిరాకర్. ప్రస్తుతం బీఈడీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అనంత్.. 2006 నుంచి 2020 మధ్య చలామణీలోకి వచ్చిన 21 రకాల 10 రూపాయల నాణేలను సేకరించాడు. ఈ కాయిన్స్‌ను వరల్డ్ రికార్డ్స్ ఇండియాకు పంపించాడు. అనంత్ కృషిని గుర్తించిన సంస్థ.. అతడికి వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియా జాబితాలో స్థానం కల్పించింది.
అనంత్ సేకరణ కేవలం పది రూపాయల నాణేలకే పరిమితం కాలేదు. దేశంలో ఒకప్పుడు చలామణీలో ఉన్న ఒక పైసా నుంచి అర్ధ రూపాయి వరకు సేకరించాడు. వీటితో పాటు వివిధ దేశాలకు చెందిన నాణేలు కూడా అనంత్ వద్ద ఉన్నాయి. అరబ్, శ్రీలంక, మలేసియా, నేపాల్, అమెరికా, ఇరాన్, ఆస్ట్రేలియా, ఇరాక్, కెనడా, నెదర్ల్యాండ్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, న్యూజిలాండ్, హోలాండ్ దేశాలకు చెందిన కాయిన్స్‌ను అనంత్ సేకరించాడు.
ఈ ఘనతపై అనంత్ సహా అతని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియాలో తమ కుమారుడికి స్థానం దక్కడం సంతోషంగా ఉందన్నారు.
ఇదీ చదవండి : కోట్ల రూపాయల 'మోదీ సూట్' పరిస్థితి ఇదా?