మూఢ నమ్మకాలకు నవజాత శిశువు బలైంది. ఆచారం పేరిట.. అప్పుడే పుట్టిన చిన్నారిని, బిడ్డకు జన్మనిచ్చిన తల్లిని ఊరికి దూరంగా ఉంచడం వల్ల ఓ పండంటి శిశువు ప్రాణాలు కోల్పోయింది. కర్ణాటకలోని తుమకూరులో ఈ ఘటన జరిగింది. మల్లెనహళ్లి గొల్లార్హట్టి గ్రామానికి చెందిన సిద్ధేశ్, వసంతలకు నెల రోజుల క్రితం కవలల రూపంలో ఓ బాబు, పాప జన్మించారు. పుట్టిన వెంటనే బాలుడు మృతి చెందాడు. దీంతో బాలికతో కలిసి తమ గ్రామానికి వచ్చారు.
అయితే, గ్రామంలోని ప్రజలు సూతక ఆచారం అనే అంధ విశ్వాసం పాటిస్తుంటారు. ఈ మూఢ నమ్మకం ప్రకారం నవజాత శిశువులను, బాలింతలను గ్రామంలోకి రానివ్వరు. కుటుంబంలో ఎవరైనా చనిపోయినా.. వారిని ఊరికి దూరంగానే ఉంచుతారు. అలాంటి వారిని ఊర్లో ఉంచితే తమ దేవుడికి ఇష్టం ఉండదని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. ఈ నేపథ్యంలో వసంతను సైతం ఊర్లోకి అనుమతించలేదు. దీంతో గ్రామ శివారులో ఏర్పాటు చేసిన గుడిసెలో వసంత.. తన బిడ్డతో కలిసి ఇన్ని రోజులూ గడిపింది.
చలికి తట్టుకోలేక..
వర్షాల కారణంగా కొద్దిరోజులుగా వాతావరణం చల్లగా మారిపోయింది. అయినప్పటికీ వసంత గుడిసెలోనే ఉండిపోయింది. ఫలితంగా శిశువు అస్వస్థతకు గురైంది. దీంతో చిన్నారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ శిశువు ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో తుమకూరు వైద్యాధికారులు మల్లెనహళ్లి గొల్లార్హట్టి గ్రామాన్ని సందర్శించారు. బాధితురాలి ఇంటికి వెళ్లిన తహసీల్దార్ సిద్ధేశ్, ఆర్సీహెచ్ మోహన్, టీహెచ్ఓ లక్ష్మీకాంత్.. ఆ కుటుంబాన్ని పరామర్శించారు. మూఢ నమ్మకాలను వదిలిపెట్టాలని గ్రామ పెద్దలకు సూచించారు. నవజాత శిశువులను, బాలింతలను ఊర్లోకి అనుమతించాలని కోరారు.
ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్ అలీగఢ్‌లోనూ ఇలాంటి ఘటన జరిగింది. నాగుపాము కాటుకు గురై చనిపోయిన ఓ బాలుడిని బతికించేందుకు తాంత్రికులు విఫలయత్నం చేశారు. బాలుడి మరణించగానే కుటుంబ సభ్యులు, బంధువులు అతడి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. అయితే, పాములు పట్టేవారు బాలుడ్ని బతికిస్తామని చెప్పడం వల్ల పూడ్చిపెట్టిన శవాన్ని వెలికితీశారు కుటుంబ సభ్యులు. చేతిలో వేపకొమ్మలు పట్టుకుని.. మంత్రాలు పఠిస్తూ పాములు పట్టేవారు పూజలు చేశారు. ఎంతకీ బాలుడిలో చలనం లేకపోవడం వల్ల మళ్లీ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.