karnataka student got 16 Gold Medals: తన తండ్రి ఓ రైతు.. ఆయన పడే కష్టాన్ని తీర్చాలంటే ఆ రంగంలో మార్పులు తేవాలని నమ్మింది ఆ విద్యార్థిని. అందుకే ఉద్యానవన శాస్త్రాన్ని చదివి ఏకంగా 16 బంగారు పతకాలను సాధించింది. కర్ణాటక చిక్కమగళూరుకు చెందిన ఉమ్మె సారా 16 గోల్డ్ మెడల్స్ దక్కించుకుని రికార్డు సృష్టించింది. ఉద్యానవన విశ్వవిద్యాలయంలో జరిగిన 11వ స్నాతకోత్సవంలో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ చేతుల మీదుగా అందుకుంది. ఓ విద్యార్థి 16 బంగారు పతకాలు సాధించడం ఇదే తొలిసారి.
![karnataka student got 16 Gold Medals](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15415062_1.jpg)
![karnataka student got 16 Gold Medals](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15415062_2.jpg)
చిక్కమగళూరుకు చెందిన అస్మత్ అలీ, రహిమ బాను దంపతుల కుమార్తె ఉమ్మె సారా.. ఉద్యానవన విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చదువుకుంటోంది. మూడబిద్రెలో పాఠశాల విద్య, పీయూసీని పూర్తిచేసిన ఆమె.. ఉద్యానవన విశ్వవిద్యాలయంలో చేరి ఈ ఘనత సాధించింది. వ్యవసాయ రంగంలో శాస్త్రీయ పరిశోధనలు చేసి రైతులకు సాయం చేయడమే తన లక్ష్యమని పేర్కొంది. అందుకే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి విశ్వవిద్యాలయంలో సీటు దక్కించుకున్నానని సారా తెలిపింది.
![karnataka student got 16 Gold Medals](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15415062_2.jpg)
"చిన్ననాటి నుంచి చదువు విషయంలో నా తల్లిదండ్రులు ఎప్పుడూ ప్రోత్సహించేవారు. ఈ విషయంలో వారు రాజీపడలేదు. నా తల్లిదండ్రుల సహకారంతోనే 16 బంగారు పతకాలు సాధించాను. శాస్త్రీయ పరిశోధనలు చేసి రైతు సమాజానికి చేయూతనివ్వడమే నా లక్ష్యం."
-ఉమ్మె సారా, 16 బంగారు పతకాల విజేత
ఇటలీలోని పాడువా విశ్వవిద్యాలయంలో చదువుకోవాలన్నది తన లక్ష్యమని.. అందుకు రూ.20 లక్షలు ఖర్చు అవుతాయని తెలిపింది. కానీ తనకు బ్యాంకులు రుణాన్ని కూడా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వమే తనకు సహాయం చేయాలని సారా విజ్ఞప్తి చేసింది.
ఇదీ చదవండి: 'దిల్లీ పోలీస్ చీఫ్' ఫొటోతో లాయర్‌కు బెదిరింపులు.. పోలీసులు అలర్ట్