Karnataka Police Dog Raksha : కర్ణాటకలో ఓ హత్య కేసులో నిందితుడిని పోలీసులకు పట్టించింది ఓ కుక్క. 1.5 కిలోమీటర్లు పరుగెత్తికెళ్లి పొదల మధ్య దాక్కున్న నిందితుడిని గుర్తించింది 'రక్ష' అనే పోలీసు శునకం. ఈ క్రమంలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కోలార్ జిల్లా బేవహల్లికి చెందిన సురేశ్, రవి మంచి స్నేహితులు. ఆగస్టు 11వ తేదీ రాత్రి వీరిద్దరు కలిసి మద్యం సేవించారు. ఆ సమయంలో సురేశ్, రవి మధ్య గొడవ జరిగింది. అనంతరం వారిద్దరూ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే సురేశ్‌పై కోపం పెంచుకున్నాడు రవి. స్నేహితుడిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. సురేశ్ ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న అతడిపై ఇనుప రాడ్‌తో దాడి చేసి చంపాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న నంగలి పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ వారికి హత్యకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదు. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాన్ని రంగంలోకి దించారు.
హత్య జరిగిన ప్రదేశంలో రక్తం వాసన రావడం వల్ల 'రక్ష' అనే పోలీస్ డాగ్.. 1.5 కిలోమీటర్లు పరుగెత్తుకెళ్లి పొదల్లో దాక్కున్న నిందితుడు రవిని గుర్తించింది. నంగలి పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో నిందితుడు.. పోలీసులు ఎదుట తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడిని కోర్టులో ప్రవేశపెట్టారు.
"బేవహల్లి గ్రామంలో ఇటీవల సురేశ్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఘటనాస్థలికి చేరుకున్న మాకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. బాధితుడికి ఎవరితోనూ శత్రుత్వం లేదని ప్రాథమిక విచారణలో తేలింది. ఫోరెన్సిక్ బృందం, వేలిముద్రల బృందం, డాగ్ స్క్వాడ్‌ను ఘటనాస్థలికి రప్పించాం. 'రక్ష' అనే పోలీస్ డాగ్.. హత్య జరిగిన ప్రదేశంలో రక్తం వాసనను పసిగట్టింది. 1.5 కిలోమీటర్లు పరుగెత్తి నిందితుడిని గుర్తించింది."
--ఎం. నారాయణ, కోలార్ ఎస్పీ
నిందితుడిని 24 గంటల్లో పట్టించిన శునకం 'రక్ష'.. గత 8 ఏళ్లుగా కోలార్ క్రైమ్ బ్రాంచ్‌లో పనిచేస్తోంది. ఇప్పటికే పలు కేసుల్లో నిందితులను పోలీసులకు పట్టించింది. 'రక్ష'పై పోలీసులు సహా స్థానికులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
మర్డర్ కేసును ఛేదించిన పోలీస్ డాగ్ 'తార'.. 8 కి.మీ రన్నింగ్ చేసి మరీ నిందితుడి గుర్తింపు