Karnataka night curfew: ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్త వేరియంట్ వ్యాప్తిని నియంత్రించేందుకు నైట్ కర్ఫ్యూను విధిస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం (డిసెంబర్ 28) నుంచి 10 రోజుల పాటు రాత్రి పూట ఆంక్షలు ప్రారంభమవుతాయని తెలిపింది.
Omicron in Karnataka
రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై అధికారులతో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నిర్వహించిన సమావేశం తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. కర్ణాటక వైద్య శాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ నైట్ కర్ఫ్యూ ప్రకటన చేశారు. రాత్రి పది నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపారు. పది రోజుల పాటు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు.
కొత్త సంవత్సర వేడుకలపైనా ఆంక్షలు విధిస్తున్నట్లు సుధాకర్ తెలిపారు. డీజే పార్టీలు, బహిరంగ వేడుకలు పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. హోటళ్లు, పబ్లు 50 శాతం సామర్థ్యంతోనే పనిచేయాలని చెప్పారు.
కర్ణాటకలో కొత్తగా ఏడు ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 38కి పెరిగింది.
ఇప్పటికే మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించాయి.
ఇదీ చదవండి: India Covid Cases: దేశంలో మరో 6,987 కరోనా కేసులు