Karnataka Honour Killing Case: కర్ణాటక.. విజయపుర జిల్లాలోని కృష్ణానది వెనుక జలాల్లో గోనె సంచిలో కుళ్లిన స్థితిలో లభ్యమైన మృతదేహం ఆధారంగా పోలీసులు ఓ ప్రేమ జంట చావు రహస్యాన్ని ఛేదించారు. యువతి ఆత్యహత్య చేసుకోగా.. ఆ యువకుడిని ఆమె కుటుంబసభ్యులు కడతేర్చినట్లు దర్యాప్తులో గుర్తించారు. యువకుడి శవం లభించగా యువతి మృతదేహం కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది. నిందితులను బంధించి ప్రశ్నించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం..
జిల్లాలోని తికోటా తాలూకా ఘోణసగి గ్రామానికి చెందిన. మల్లికార్జున జమఖండి(20), కల్లవటగికి చెందిన గాయత్రి (18) ప్రేమించుకున్నారు. విజయపురలోని కళాశాలకు బస్సులో వెళ్లి.. వచ్చే సమయంలో వీరి మధ్య ప్రేమ మొలకెత్తింది. సెప్టెంబర్ 23న మల్లికార్జున ఆ యువతి ఇంటికి వెళ్లాడు. పొలంలో ఉన్న ఇంటి పక్కనే ఓ గదిలో ఆ ఇద్దరూ మాట్లాడుకోవడం గుర్తించిన యువతి తండ్రి గురప్ప వేగంగా.. ఆ గదికి తాళం వేశారు. భయపడిపోయిన ఆ యువతి అక్కడే ఉన్న పురుగుల మందును తాగేసింది. విష ప్రభావంతో అక్కడికక్కడే మరణించింది.
కొద్దిసేపటి తరువాత యువతి తండ్రి గురప్ప, బంధువులు అజిత్, మల్లప్ప తాళంతీసి ఆ గదిలోకి వెళ్లారు. యువతి మరణంపై ఊగిపోయారు. యువకుడిని స్తంభానికి కట్టి బలవంతంగా పురుగుల మందు తాగించారనేది నేరారోపణ. ఇద్దరి మృతదేహాలను వేర్వేరు సంచుల్లో కట్టి సెప్టెంబరు 24న కొర్తికొల్లార వంతెన వద్ద కృష్ణా నదిలో పడవేశారు. అక్టోబర్ 5న గాయత్రి అపహరణకు గురైనట్లు తికోటా పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడు కనిపించకుండా పోయినట్లు కుటుంబసభ్యులు మరో కేసు నమోదు చేశారు.
అక్టోబరు 10న బీళగి వద్ద గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభించింది. ధరించిన టీషర్ట్ ఆధారంగా యువకుడి ఆధారాలు సేకరించారు. తరువాత దర్యాప్తులో ప్రేమికుల్లో ఒకరు ఆత్మహత్య.. మరొకరు హత్యకు గురైనట్లు తేలింది. ఇది పరువు హత్య అనే అనుమానాలూ జోరందుకున్నాయి. నిందితులను శుక్రవారం బంధించి కస్టడీకి అప్పగించారు.