Karnataka hijab row: హిజాబ్ వివాదంతో కర్ణాటకలో మూతపడిన విద్యాసంస్థలు సోమవారం తిరిగి తెరచుకున్నాయి. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం చర్యలు తీసుకున్నందున.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. పలుచోట్ల కొందరు విద్యార్థినులు హిజాబ్‌తో పాఠశాలలకు రాగా వాటిని తొలగించిన తర్వాతే యాజమాన్యం లోనికి అనుమతించింది.
High schools reopen Karnataka
మాండ్యలోని రోటరీ పాఠశాలలో ఓవిద్యార్థిని హిజాబ్ ధరించి వచ్చింది. ఆమెను హిజాబ్ తీసేసి లోనికి రావాలని పాఠశాల సిబ్బంది చెప్పారు. ఈ నేపథ్యంలో తమ పిల్లలను హిజాబ్‌తోనే లోపలికి అనుమతించాలని.. విద్యార్థుల తల్లిదండ్రులు సిబ్బందితో వాదించారు. చివరకు హిజాబ్ తీసేసిన తర్వాతే సదరు విద్యార్థినులను తరగతిలోనికి అనుమతించారు.
Karnataka Hijab schools
శిమమొగ్గ జిల్లాలోని ఓ పాఠశాలలో హిజాబ్‌తో తమను తరగతులకు హాజరు కానివ్వలేదని 13మంది విద్యార్థినులు పరీక్షకు బహిష్కరించారు. హిజాబ్‌తో హజరైన విద్యార్థినులను గేటు దగ్గర నిలువరించిన సిబ్బంది.. హిజాబ్‌ను తొలగిస్తేనే పరీక్షకు అనుమతిస్తామని సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో విద్యార్థినులు పరీక్షను బహిష్కరించి పాఠశాల నుంచి వెనుదిరిగారు.
హిజాబ్‌తోనే తరగతులకు...
కలబురగి జిల్లాలోని ఉర్దూ హైస్కూల్‌లో దాదాపు 10మంది విద్యార్థినులు హిజాబ్ ధరించి తరగతులకు హాజరయ్యారు. ఈ విషయంపై పాఠశాల సిబ్బందిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. విద్యార్థినుల హిజాబ్‌ను తిసేయించారు. సదరు విద్యార్థినులు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు కావడం వల్ల.. వారికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల పట్ల అవగాహన లేదని పాఠశాల సిబ్బంది తెలిపారు. వారిని గమనించిన వెంటనే హిజాబ్‌ను తిసేయించామని పేర్కొన్నారు.
సెక్షన్ 144...
బెళగావి జిల్లాలోని అంజుమన్, సర్దార్ పాఠశాలలకు కూడా కొంతమంది విద్యార్థినులు హిజాబ్ ధరించి హాజరయ్యారు. వారిని సిబ్బంది అడ్డుకుని హిజాబ్ తొలగించాలని సూచించారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమ పిల్లలు మాస్క్‌ను తీస్తారేమో గాని.. హిజాబ్‌ను మాత్రం తొలగించరంటూ వారి తల్లిదండ్రులు వాదించారు. ఈ పరిస్థితుల్లో పాఠశాలల సమీపంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్తగా సెక్షన్ 144 విధించారు.
పాఠశాలల వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా, ఉడిపి, దక్షిణకన్నడ, మంగళూరు, శివమొగ్గ, బెంగళూరులో.. ఉన్నత పాఠశాలల వద్ద సెక్షన్ 144 విధించారు. ఈనెల 19వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్ ఉంటుందని స్పష్టం చేశారు.
ఉన్నత విద్యాసంస్థలకు ఈనెల 16 వరకు సెలవులు పొడగించినట్లు.. ప్రభుత్వం వెల్లడించింది. పరిస్థితులను అంచనా వేసిన తర్వాత డిగ్రీ, ప్రీయూనివర్సిటీ కళాశాలల పున:ప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది.
కుట్రలో భాగంగానే..
కర్ణాటకలో చోటుచేసుకుంటున్న హిజాబ్ వివాదం కుట్రలో భాగమేనని అనుమానిస్తున్నట్లు కర్ణాటక హోంశాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర ఆరోపించారు. ఈ వివాదాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న ఆయన.. ఇది దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నమేనని తెలిపారు. ప్రస్తుతం హిజాబ్ కేసు హైకోర్టు పరిధిలో ఉన్నందున న్యాయస్థానం ఇచ్చే ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
హైకోర్టులో విచారణ...
Karnataka High Court hijab
హిజాబ్‌పై నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై కర్ణాటక హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫున వాదించిన సీనియర్ అడ్వొకేట్ దేవదత్ కామత్.. హిజాబ్‌పై ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఆర్టికల్ 25 ప్రకారం చెల్లదని అన్నారు. హిజాబ్‌ను ధరించాలా వద్దా అనే విషయాన్ని కాలేజీ కమిటీలు నిర్ణయించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. కేంద్రీయ విద్యాలయాల్లోనూ హిజాబ్‌ను అనుమతిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మతాచారాలను పాటించడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగితే దాన్ని నియంత్రించవచ్చని అన్నారు.
ఇదీ చదవండి: డ్రీమ్ 11కు లైన్ క్లియర్- కొత్త చట్టాన్ని కొట్టేసిన హైకోర్ట్