Hijab Issue: కొన్ని నెలలుగా కర్ణాటకలో చర్చనీయాంశంగా మారిన హిజాబ్ వివాదంపై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ వస్త్రధారణపై.. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కోర్టు సమర్థించింది. హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లంటినీ కొట్టివేసింది.
ఇస్లాం మతాచారం ప్రకారం.. హిజాబ్ ధరించడం తప్పనిసరేం కాదని తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది జస్టిస్ రీతు రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం. విద్యాసంస్థల్లో యూనిఫాం ధరించాలన్న నిబంధన సహేతుకమేనని.. విద్యార్థులు దీనికి అభ్యంతరం చెప్పకూడదని పేర్కొంది.
''ఇస్లాం మతవిశ్వాసాల ప్రకారం.. ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని మేం విశ్వసిస్తున్నాం. దీనినే పరిగణనలోకి తీసుకుంటున్నాం. అసలు విద్యాసంవత్సరం మధ్యలో ఈ సమస్య ఎలా ఉత్పన్నమైంది అని మేం తీవ్రంగా కలత చెందాం.''
- కర్ణాటక హైకోర్టు
తరగతి గదుల్లో సమానత్వం, సమగ్రత, సామరస్యతను దెబ్బతీసే దుస్తులను ధరించరాదని కర్ణాటక ప్రభుత్వం ఫిబ్రవరి 5న ఇచ్చిన ఆదేశాలు కొట్టివేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
స్వాగతించిన విద్యాశాఖ మంత్రి..
కర్ణాటక హైకోర్టు తీర్పును స్వాగతించారు రాష్ట్ర ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్. ప్రభుత్వ వైఖరిని న్యాయస్థానం సమర్థించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇతర విషయాలకంటే.. చదువే ముఖ్యమని, విద్యార్థులంతా కోర్టు ఆదేశాలను తప్పక పాటించాలని కోరారు.
కట్టుబడి ఉండాల్సిందే..
విద్యాసంస్థల్లో దుస్తుల విషయంలో.. హైకోర్టు ఆదేశాల మేరకు అంతా నడుచుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై విజ్ఞప్తి చేశారు. కోర్టు ఆదేశాల అమలు చేసేందుకు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. హిజాబ్ వివాదానికి తెరపడిందని ఇకపై విద్యార్థులు చదువుపై దృష్టిపెట్టాలని సూచించారు.
పిటిషనర్ల వాదనలను వ్యక్తిగతంగా సమర్థిస్తున్నట్లు కర్ణాటక ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య తెలిపారు. అయితే.. కోర్టు ఆదేశాలను పాటించాల్సి ఉంటుందని, తీర్పు ప్రతిని చూడాల్సి ఉందన్నారు. కర్ణాటక హైకోర్టు తీర్పు తీవ్ర నిరాశకు గురిచేసిందని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ వెల్లడించారు. ఒక పక్క మనం మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ.. వారు తమకు నచ్చినట్లు ఉండే అంశాలను నిరాకరిస్తున్నామని ముఫ్తీ పేర్కొన్నారు. నచ్చిన ప్రకారం దుస్తులు ధరించే మహిళ ప్రాథమిక హక్కులను హైకోర్టు సమర్థించలేదని.. నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు.
పరీక్షల బహిష్కరణ..
హైకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ యాదగిరి జిల్లా కేంబావిలోని ప్రీ కాలేజ్ విద్యార్థులు పరీక్షలను బహిష్కరించారు. ఎగ్జామ్ హాళ్లకు వెళ్లకుండా ఇళ్లకు తిరుగుముఖం పట్టారు. హైకోర్టు తీర్పును తాము వ్యతిరేకించడం లేదని, కానీ సుప్రీంలో సవాల్ చేస్తామని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు చెప్పారు.
హైకోర్టు తీర్పు అనంతరం ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా యాదగిరిలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
పటిష్ఠ భద్రత..
హిజాబ్‌పై తీర్పు నేపథ్యంలో.. కలబురగి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ను అమల్లోకి తెచ్చింది. సోమవారం రాత్రి 8 గంటల నుంచి మార్చి 19 ఉదయం 6 గంటల వరకు ఇది వర్తిస్తుందని తెలిపింది. విద్యాసంస్థలను కూడా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. శివమొగ్గలోనూ స్కూళ్లు, కాలేజీలను మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
మార్చి 15-21 మధ్య బెంగళూరులోని బహిరంగ ప్రదేశాల్లో.. గుమిగూడటం, నిరసనలు, వేడుకలు చేయడానికి వీల్లేదని కమిషనర్ కమల్ పంత్ వెల్లడించారు.
బెంగళూరులోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతు రాజ్ అవస్థి నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.
Hijab Controversy Karnataka: గతేడాది డిసెంబర్ చివర్లో హిజాబ్ వివాదం మొదలైంది. హిజాబ్ ధరించిన కొందరు మహిళలను ఉడుపిలోని ఓ ప్రభుత్వ ప్రీ-యూనివర్సిటీ కళాశాల యాజమాన్యం లోపలికి అనుమతించలేదు. దీనిపై నిరసన వ్యక్తమైంది. దీంతో హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి కళాశాలలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో హిజాబ్ అనుకూల, వ్యతిరేక ఆందోళనలు తీవ్రమయ్యాయి.
ఈ నేపథ్యంలోనే కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు ఫిబ్రవరి 9న సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. కోర్టు ఆదేశానుసారం ఫిబ్రవరి 14న పాఠశాలలను, 16న కళాశాలలను తెరిచారు. అయితే.. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వులో ఉంచింది.
హిజాబ్ వివాదంపై తుది తీర్పు వెల్లడించేవరకు ఎవరూ మతపరమైన వస్త్రాలు ధరించి కళాశాలలకు రావద్దని కర్ణాటక హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం అప్పటి తీర్పులో వెల్లడించింది.
ఇవీ చూడండి: కర్ణాటకలో సిక్కు బాలుడికి అడ్మిషన్ నిరాకరణ.. చివరకు చర్చలతో..