Karnataka HC on marital rape: వివాహం అంటే భార్యపై లైంగిక వేధింపుల క్రూరమైన చర్యకు భర్త లైసెన్స్ పొందడం కాదని కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అత్యాచారం, క్రూరత్వం, పోక్సో చట్టం కింద ఓ వ్యక్తి.. భార్య, కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై దాఖలైన కేసులు కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376ప్రకారం తనపై పెండింగ్‌లో ఉన్న అత్యాచార ఆరోపణలను ఎత్తివేయాలని సదరు వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు.. సింగిల్ జడ్జి జస్టిస్ ఎమ్ నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం అత్యాచారం అభియోగాన్ని రద్దు చేసేందుకు నిరాకరించింది. ఏదైనా నిర్దిష్ట పురుష అధికారానికి వివాహాన్ని లైసెన్స్‌గా భావించకూడదని పేర్కొంది.
భార్యపై లైంగిక వేధింపుల క్రూరమైన చర్య అత్యాచారమే అని కోర్టు తెలిపింది. వివాహం ఏ విధంగానూ స్త్రీ.. పురుషునికి అధీనంలో ఉన్నట్లు కాదని కోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగం ప్రకారం హక్కులు సమానం, భద్రత స్తీ, పురుషులకు సమానమేనని స్పష్టం చేసింది. అటు.. వైవాహిక అత్యాచారాల కేసుల పెరుగుదలపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. భార్యపై భర్త లైంగిక వేధింపులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని పేర్కొంది. లైంగిక వేధింపులు వారిపై మానసికంగా, శారీరకంగా ప్రభావం చూపుతాయని వ్యాఖ్యానించింది. చట్టంలోని అసమానతలు తొలగించాలని చట్టసభ సభ్యులకు సూచించింది.
ఇదీ చదవండి: 28,29న దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె.. ఆ సేవలకు అంతరాయం