Karnataka Free Rice Scheme : కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలకు రేషన్ బియ్యానికి బదులుగా నగదును ఇవ్వనున్నట్లు తెలిపింది. కిలోకు 34 రూపాయల చొప్పున అందించనున్నట్లు వెల్లడించింది. పూర్తి మొత్తంలో బియ్యాన్ని సేకరించి వాటిని ప్రజలకు సరాఫరా చేసేంత వరకు.. జులై 1 నుంచి ఇలా నగదును ఇవ్వనున్నట్లు పేర్కొంది. బుధవారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్వర్యంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కర్ణాటకలో అధికారంలోకి వస్తే.. ప్రతి బీపీఎల్ కుటుంబానికి నెలకు 10 కిలోల ఉచిత బియ్యం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. 'అన్నభాగ్య' అనే పేరుతో జులై 1న ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికిప్పుడే అంత మొత్తంలో ప్రజలకు బియ్యం సరఫరా చేయడంలో కాస్త ఇబ్బందులు తలెత్తవచ్చనే అభిప్రాయంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో నెలకు ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని ప్రజలకు అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి అదనంగా మరో ఐదు కిలోల బియ్యాన్ని ఇస్తామని తన ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం బియ్యం సేకరణలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. రైస్‌కు బదులుగా నగదును ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
"జులై 1నే 'అన్నభాగ్య' పథకం ప్రారంభమవుతున్న తరుణంలో.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు మిగతా కేబినెట్ మంత్రులం బుధవారం సమావేశమయ్యాం. కొద్ది రోజుల వరకు బియ్యానికి బదులుగా నగదును ఇవ్వాలని నిర్ణయించాం. బియ్యం ప్రామాణిక ధరను రూ.34గా పుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. అంతే మొత్తాన్ని ప్రజలకు మేము కూడా ఇవ్వాలని నిర్ణయించాం." అని సమావేశం ముగిసిన అనంతరం మంత్రి కేహెచ్ మునియప్ప మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వం భారీ మొత్తంలో బియ్యం సేకరణను ప్రయత్నిస్తోందని.. కానీ అవసరానికి తగినట్లుగా వాటిని సరఫరా చేసేందుకు ఏ సంస్థ ముందుకు రావట్లేదని ఆయన తెలిపారు.
ఒక రేషన్ కార్డ్‌లో ఒకే వ్యక్తి ఉన్నా.. వారికి నెలకు ఐదు కిలోల బియ్యానికి బదులుగా 170 రూపాయలు చెల్లిస్తామని మునియప్ప వివరించారు. ఇద్దరు ఉంటే రూ.340, ఐదుగురుంటే రూ.850 ఇస్తామన్నారు. ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని వివరించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీల్లో అన్నభాగ్య పథకం ఒకటని.. అధికారంలోకి వచ్చిన మొదటి కేబినెట్ సమావేశంలో దాని అమలుకు నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు.