నెలన్నరకు పైగా రసవత్తరంగా సాగిన కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగిసింది. నేతల విమర్శలు, ప్రతి విమర్శలు.. పోటాపోటీ ఉపన్యాసాలు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీల హామీల జల్లులతో గత కొన్నిరోజులుగా కన్నడ నాట సాగిన ప్రచార పండగకు తెరపడింది. ప్రధానంగా అధికార బీజేపీతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీ జేడీఎస్ కన్నడ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు తమ శక్తిమేర పోరాడాయి.
కన్నడ ఓటర్లు ఎవరిపై కరుణ చూపిస్తారో?
ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారే కర్ణాటకలో వరుసగా రెండోసారి అధికారం నిలబెట్టుకొని 38 ఏళ్ల చరిత్రను తిరగరాయాలని కాషాయదళం భావిస్తోంది. భాజపాను గద్దెదించి 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు తలుపు తెరవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఒకవేళ హంగ్ ఏర్పడితే ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ పాత్ర పోషించేందుకు జేడీఎస్.. తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. 2024 ఎన్నికలకు ముందు కీలకంగా మారిన నేపథ్యంలో కన్నడ ఓటర్లు ఎవరిపై కరుణ చూపిస్తారోనని.. పార్టీలతోపాటు యావత్ దేశం ఎదురుచూస్తోంది. 224 స్థానాలు ఉన్న కర్ణాటక శాసనసభకు బుధవారం ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా.. శనివారం ఫలితాలు వెల్లడికానున్నాయి. మేజిక్ ఫిగర్ 113 కంటే ఎక్కువ సీట్లు సాధించి.. సొంతంగా అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ, కాంగ్రెస్‌లు యోచిస్తున్నాయి.
మోదీ.. అన్నీ తానై..
బీజేపీ తరఫున ప్రధాని నరేంద్రమోదీ, నడ్డా, అమిత్ షా సహా కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ప్రచారం చేశారు. ప్రధాని మోదీ.. అన్నీ తానై ప్రచారాన్ని ముందుండి నడిపించారు. డబుల్ ఇంజిన్ సర్కార్, జాతీయ అంశాలు, కేంద్ర పథకాలే ప్రధాన అస్త్రాలుగా కమలం పార్టీ ప్రచార హోరు సాగించింది. ముఖ్యంగా గతనెల 29వ తేదీ నుంచి ప్రధాని మోదీ సుడిగాలి ప్రచారంతో కర్ణాటక మొత్తం చుట్టేశారు. 18 భారీ బహిరంగ సభలు, 6 రోడ్‌షోలు నిర్వహించారు. ఈసారి బీజేపీకి పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ప్రధాని మోదీ.. కన్నడిగులను కోరారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు నుంచే కర్ణాటకలో ఏడుసార్లు పర్యటించారు.
బీజేపీ అగ్రనేతలంతా..
కేంద్రమంత్రి అమిత్ షా కూడా కర్ణాటకలో విస్తృతంగా పర్యటించారు. వీరితోపాటు బీజేపీ అగ్రనేతలంతా ప్రచారంలో పాల్గొన్నారు. 2008, 2018లో ఎక్కువ సీట్లు సాధించినప్పటికీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి సమస్యలు ఎదుర్కొన్న కమలం పార్టీ ఈసారి 150సీట్లు సాధించాలని పావులు కదుపుతోంది. ముఖ్యంగా పాత మైసూరు ప్రాంతంలో పాగా వేయాలని భావిస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో విజయం ద్వారా పార్టీకి పూర్వ వైభవం తేవాలని ఆ పార్టీ నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
మోదీ విమర్శలకు రాహుల్- ప్రియాంక కౌంటర్లు!
కర్ణాటకలో విజయం ద్వారా ఈ ఏడాది చివర్లో జరిగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల కోసం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని హస్తం పార్టీ ఆలోచిస్తోంది. ఈసారి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ విస్తృత ప్రచారం నిర్వహించారు. మోదీ సహా బీజేపీ నేతల విమర్శలకు.. రాహుల్-ప్రియాంక ధీటుగా స్పందిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
ఖర్గే సొంత రాష్ట్రం.. కాంగ్రెస్‌కు కీలకం..
ప్రభుత్వ వ్యతిరేకత, కమలం పార్టీ సీనియర్లను పక్కనపెట్టడం వంటి అంశాలను సానుకూలంగా మార్చుకొని అధికారపగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీజేపీ ప్రభుత్వ అవినీతి, నిరుద్యోగం, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను ఎత్తిచూపుతూ ప్రచారం నిర్వహించింది. ప్రచార గడువుకు కొన్నిరోజుల ముందు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ హుబ్బళ్లి సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సొంత రాష్ట్రం కావడం వల్ల ఇక్కడ గెలవడం హస్తం పార్టీకి కీలకం కానుంది. ఈ ఎన్నికల్లో 150 స్థానాల్లో గెలవాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.
జేడీఎస్‌కు ఈ ఎన్నికలు కీలకం!
కుుటంబ పార్టీగా పేరు గాంచిన జేడీఎస్‌కు కూడా ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఇప్పటివరకు కింగ్ మేకర్‌గా ఉన్న ఆ పార్టీ మనుగడకు ఈ ఎన్నికలు సవాల్‌గా మారాయి. ఈసారి కూడా హంగ్ ఏర్పడితే జేడీఎస్ కీలకపాత్ర వహించనుంది. పార్టీలో చీలికలు, అంతర్గత కలహాలు, కుటుంబపార్టీ అనే ముద్ర వంటి ఆరోపణల మధ్య ప్రచారం నిర్వహించింది. మాజీ సీఎం కుమారస్వామి.. అన్నీ తానై ప్రచారాన్ని తన భుజాలపై వేసుకున్నారు. గతంకంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందాలని భావిస్తున్న జేడీఎస్.. అనారోగ్యంతో ఉన్న మాజీ ప్రధాని దేవెగౌడతోనూ ప్రచారం చేయించింది. ముఖ్యంగా ఆ పార్టీకి గట్టిపట్టున్న పాతమైసూరు ప్రాంతంలో కన్నడ సెంటిమెంట్‌తో ప్రచారం నిర్వహించారు. ఈసారి 35 నుంచి 40స్థానాలు దక్కించుకుంటే. ప్రభుత్వ ఏర్పాటులో చక్రం తిప్పవచ్చని జేడీఎస్ భావిస్తోంది.
మూడు పార్టీలు.. 1,230 రోడ్ షోలు..
ఈ ఎన్నికలు అరుదైన రికార్డులకు వేదికయ్యాయి. 2024లో లోక్‌సభ ఎన్నికలకు దిక్సూచిగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణించే ఈ ఎన్నికల ప్రచారానికి జాతీయ నేతలు తరలి వచ్చారు. 2018లో 3 ప్రధాన పార్టీలు 40 రోజుల్లో 530 రోడ్ షోలను నిర్వహించగా ఈ ఎన్నికల్లో వాటి సంఖ్య 1,230కు చేరుకుంది. వీటిలో అత్యధికంగా 440 రోడ్ షోలను బీజేపీ, 320 కాంగ్రెస్, 300కుపైగా జేడీఎస్ నిర్వహించింది. బహిరంగ సభల్లోనూ ఈ ఎన్నికలు రికార్డులు సృష్టించాయి. 2018లో 400కుపైగా బహిరంగ సభలు నిర్వహించగా ఈ ఎన్నికల్లో 870 సభలను నిర్వహించినట్లు ఆయా పార్టీల నివేదికలు వెల్లడించాయి. బీజేపీ అత్యధికంగా 275, కాంగ్రెస్ 240, జేడీఎస్ 221 బహిరంగ సభలు, సమావేశాలను నిర్వహించాయి.
కర్ణాటక ఎన్నికలపై ప్రత్యేక కథనాలు
- ఒకే సీటు.. ఒకే పేరు.. ఇద్దరికి మించి అభ్యర్థులు.. పార్టీల 'కన్ఫ్యూజన్' వ్యూహమిది!
- కర్ణాటకలో 'నోటా' కలవరం.. ఓటర్లు 'జై' కొడితే పార్టీల ఆశలు గల్లంతే!
- బీజేపీ X కాంగ్రెస్.. ఆ ఐదు చోట్ల MES గట్టి పోటీ.. బెళగావిపై పట్టు ఎవరిదో?
- తెలుగు ప్రజల ఓటే శాసనం.. కర్ణాటకలో 12 జిల్లాల్లో ప్రభావం.. మద్దతు ఎవరికో?
- కర్ణాటక పోరు.. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో సగం మంది డిపాజిట్లు లాస్.. ఎందుకిలా?
- 'ఫ్రీ' హామీలతో ఓట్ల వేట.. ఆ పార్టీ గెలిస్తే ఒకేసారి రూ.2లక్షలు!
- వదిన X మరిది.. బళ్లారిలో 'గాలి' కుటుంబ రాజకీయం.. గెలిచేదెవరో?
- బజరంగ్ బలీ చుట్టూ కర్ణాటక రాజకీయం.. కాంగ్రెస్‌లో గుబులు.. నష్టం తప్పదా?
- లింగాయత ఓట్ల కోసం కుస్తీ.. ఆ అభ్యర్థులకే పెద్దపీట.. సీఎం పదవీ వారికే!
- నాలుగోవంతు సీట్లు.. 20% ఓట్లు- ఇక్కడ గెలిస్తే.. అధికారం దక్కినట్టే!
- కర్ణాటక అసెంబ్లీ పోరు.. ఈసారి 'వక్కలిగలు' ఎవరికి జై కొడతారో..?
- కర్ణాటకలో 'బ్రదర్స్ పాలిటిక్స్'.. గాలి భార్య X తమ్ముడు.. జార్కిహోలి అన్నదమ్ములు ఢీ!