Karnataka Election Results 2023 : రసవత్తరంగా సాగిన కర్ణాటక రాజధాని బెంగళూరు పరిధిలోని జయనగర అసెంబ్లీ నియోజకవర్గ ఫలితం శనివారం అర్ధరాత్రి తేలింది. రౌండు రౌండుకు మారుతున్న ఆధిక్యంలో చివరికి తొలుత ప్రకటించిన ఫలితం తారుమారై బీజేపీ అభ్యర్థి రామమూర్తి అనూహ్య విజయాన్ని సాధించారు. జయనగర అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి విజయం సాధించినట్లు తొలుత ప్రకటించారు. ఆమె బీజేపీ అభ్యర్థి రామమూర్తిపై 160 ఓట్ల తేడాతో గెలుపొందిదని అధికారులు తెలిపారు. అయితే పోస్టల్ ఓట్లకు సంబంధించి బీజేపీ అభ్యర్థి సీకే రామమూర్తి అభ్యంతరాలను లేవనెత్తారు. సీనియర్ సిటిజన్ల బ్యాలెట్ పేపర్లలో సీల్ లేకపోవడం వల్ల 160 పోస్టల్ ఓట్లు చెల్లకుండా పోయాయని.. వాటిని రీకౌంటింగ్ చేయాలని ఎన్నికల అధికారులను అభ్యర్థించారు. దీనికి అంగీకరించిన ఎన్నికల సంఘం అధికారులు ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని.. రాత్రి వేళ ఆ ఓట్లను మరోసారి లెక్కించారు.
తర్వాత జరిగిన రీ కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి రామ్మూర్తికి 57,797 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డికి 57,781 ఓట్లు వచ్చాయి. ఫలితంగా కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి.. అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. దీంతో అదే స్థానానికి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి రామమూర్తి కేవలం 16 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొందినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక రీ కౌంటింగ్ సమయంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో పాటు సౌమ్యారెడ్డి తండ్రి రామలింగారెడ్డి కౌంటింగ్ కేంద్రం వద్దనే ఉన్నారు. ఈ అనూహ్య ఫలితాలు చూసి కంగు తిన్న కాంగ్రెస్ నేతలు కౌంటింగ్ స్టేషన్ వద్దే భైఠాయించారు. దీంతో అక్కడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతే కాకుండా రామమూర్తికి.. ఎన్నికల సంఘం అధికారులు కౌంటింగ్‌లో సహకరించారని సౌమ్య మద్దతుదారులు ఆరోపించారు. కాంగ్రెస్ ఆధిక్యం కాస్త 136 నుంచి 135కు తగ్గగా.. బీజేపీ ఆధిక్యం 65 నుంచి 66 స్థానాలకు పెరిగింది.
105 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచిన మాజీ మంత్రి గుండురావు
కర్ణాటకలోని గాంధీ నగర్ నియోజక వర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ మంత్రి దినేశ్ గుండు రావు.. 105 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి సప్తగిరి గౌడపై ఆయన గెలుపొందారు. సప్తగిరి గౌడకు 54,014 ఓట్లు రాగా.. గుండు రావుకు 54,118 ఓట్లు వచ్చాయి.