కర్ణాటకలో అధికార బీజేపీలో అసమ్మతి అంతకంతకూ ముదురుతోంది. మంగళవారం ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఓ మంత్రి సహా మరో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చోటు దక్కలేదు. దీంతో వారంతా పార్టీపై గుర్రుగా ఉన్నారు. కొందరు ప్రతిపక్ష కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
కర్ణాటక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ మంగళవారం మంగళవారం ప్రకటించింది. వివిధ స్థానాలకు పోటీ చేసే 189 మంది అభ్యర్థుల పేర్లు వెల్లడించింది. ఇందులో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, ఓ మంత్రి, మరో మాజీ మంత్రికి చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో వారందరూ పార్టీ అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నారు. తొలి జాబితాలో స్థానం దక్కని నేపథ్యంలో మంత్రి అంగారా.. రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. దక్షిణ కన్నడ జిల్లాలోని సల్లియా నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. పార్టీకి మచ్చ రానివ్వకుండా నిజాయితీగా పనిచేసినందుకు తనకు దక్కిన గౌరవం ఇది అని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజీనామా బాట..
బీజేపీ తనకు టికెట్ కేటాయించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు మాజీ ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాడి. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, శాసనమండలికి గురువారం రాజీనామా చేస్తానని ప్రకటించారు. 'సీఎం బసవరాజ్ బొమ్మైపై నాకు కోపం లేదు. అయన ఉన్నత స్థాయికి ఎదగాలి. మన దేశానికి ప్రధాని కావాలని కోరుకుంటున్నాను. నేను ఎక్కడ ఉన్నా.. ఎలా ఉన్నా బొమ్మై నా గురువు. ఆయన పట్ల నాకు అపారమైన భక్తి ఉంది. ఆయన విషం ఇచ్చినా తాగేస్తా' అని సవాడి అన్నారు.
బెళగావి జిల్లాలోని అథని టికెట్ కేటాయించకపోవడంపై అసంతృప్తితో లక్ష్మణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అథని టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే మహేశ్ కుమతల్లికి కేటాయించింది బీజేపీ అధిష్ఠానం. మహేశ్.. కాంగ్రెస్ పార్టీ తరఫున 2018లో సవాడిపై గెలుపొందారు. అనంతరం బీజేపీలో చేరారు. లక్ష్మణ్ సవాడి.. అథని నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన కాంగ్రెస్‌లో చేరవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. సవాడితో కాంగ్రెస్ అగ్రనేత సిద్ధరామయ్య చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
సీట్లు దక్కనివారు..
- బెళగావి ఉత్తర సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ బెనకేకు చుక్కెదురైంది. ఆయన స్థానంలో డాక్టర్ రవి పాటిల్‌కు టికెట్ ఇచ్చారు.
- కిత్తూర్ ఎమ్మెల్యే డీఎం బసవంత్కు బదులుగా మహంతేశ్ దొడ్డగౌడకు టికెట్ కేటాయించారు.
- రామదుర్గ ఎమ్మెల్యే మహదేవప్ప యాదవ్‌కు బదులుగా చిక్క రేవన్నకు అవకాశం.
- హోసదుర్గ ఎమ్మెల్యే హట్టి శేఖర్‌కు బదులుగా ఎస్.లింగమూర్తికి టికెట్.
- ఉడుపి ఎమ్మెల్యే రఘుపతి భట్‌కు బదులుగా యశ్‌పాల్ సువర్ణకు అవకాశం.
- పుత్తూర్ ఎమ్మెల్యే సంజీవ్ మఠందూర్‌కు బదులుగా ఆశా తిమ్మప్పకు టికెట్.
- సుల్య ఎమ్మెల్యే, మంత్రి ఎస్ అంగర స్థానంలో భాగీరథి మురులయ్యకు టికెట్.
యడియూరప్ప చర్చలు ఫలిస్తాయా?
పార్టీపై గుర్రుగా ఉన్న కేఎస్ ఈశ్వరప్ప, జగదీశ్ షెట్టర్, లక్ష్మణ్ సవాడితో మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మాట్లాడినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో టికెట్ దక్కకపోయినా పార్టీలో సముచిత స్థానం ఇస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం.
'తొందరపడొద్దు'.. బొమ్మై
పార్టీలో అసంతృప్తిపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. '189 మంది అభ్యర్థులను ప్రకటించాం. కొంతమంది టిక్కెట్ దక్కనివారు అసంతృప్తిగా ఉన్నారు. నేను వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నా. లక్ష్మణ్ సవాడితో కూడా మాట్లాడా. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆయనను కోరాను' అని బొమ్మై తెలిపారు.
ఇంకా బీజేపీ రెండో విడత జాబితాలో మరో 35 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అందులో 2018 శాసనసభ ఎన్నికలో 16 చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే వారిలోనూ కొందరికి అవకాశం దక్కదని తెలుస్తోంది. ఈ సారి కొత్తవారికి అవకాశం ఇస్తామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రకటించడం గమనార్హం. మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్, పార్టీ అగ్రనేత ఈశ్వరప్ప, కరుణాకర రెడ్డి, అరవింద లింబావళి, రాందాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ఇంకా టిక్కెట్లు ప్రకటించలేదు.
పోటీకి దూరం...
వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప మంగళవారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తాను తప్పకుంటున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. బీజేపీ సీనియర్ నేత ఈశ్వరప్పకు టిక్కెట్ ఇచ్చేందుకు బీజేపీ అధిష్ఠానం నిరాకరిస్తుందనే ఊహాగానాలు ఇటీవల వచ్చాయి. శివమొగ్గ సీటుకు ఈశ్వరప్ప తన కుమారుడు కేఈ కాంతేశ్ పేరును ప్రతిపాదించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇంతలోనే ఈశ్వరప్ప రిటైర్మెంట్ ప్రకటిస్తూ లేఖ రాయడం సంచలనంగా మారింది. ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు నడ్డాకు రాసిన లేఖలో ఈశ్వరప్ప పేర్కొన్నారు.
'ఎలాగైనా పోటీ చేస్తా..'
మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ సైతం బీజేపీ అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలకు దూరంగా ఉండాలని అధిష్ఠానం తనకు సూచించిందని, పార్టీకి విశ్వాసపాత్రుడిగా ఉన్న తనకు టికెట్ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో తాను తప్పక పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ విషయంలో నిర్ణయం మార్చుకోవాలని హైకమాండ్‌ను కోరినట్లు షెట్టర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జగదీశ్ షెట్టర్‌కు.. బీజేపీ అధిష్ఠానం ఫోన్ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన దిల్లీలో పార్టీ పెద్దలకు కలవనున్నారు.
ఇవీ చదవండి:
అమూల్ X నందిని.. 120 సీట్లపై 'పాల రాజకీయం' ఎఫెక్ట్.. లాభం ఎవరికో?
కర్ణాటక ఎన్నికలు.. బీజేపీ తొలి జాబితా రిలీజ్.. ఆ స్థానం నుంచే బొమ్మై పోటీ
కర్ణాటక అసెంబ్లీ పోరు.. ఈసారి 'వక్కలిగలు' ఎవరికి జై కొడతారో..?