కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కన్నడ నటుడు కిచ్చా సుదీప్ చుట్టూ రాజకీయ దుమారం రేగుతోంది. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్లు సుదీప్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కిచ్చా సుదీప్ విషయంపై జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) పార్టీ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెలువడే వరకు సుదీప్ సినిమాలు, షోలు, వ్యాపార ప్రకటనలపై నిషేధం విధించాలని ఈసీకి లేఖ రాసింది. లేకపోతే సుదీప్ సినిమాలు, షోలు, ప్రకటనలు ఈ ఎన్నికల్లో ఓటర్లపై ప్రభావం చూపుతాయని పేర్కొంది. ఇదే విషయంపై శివమెుగ్గకు చెందిన లాయర్ కేపీ శ్రీపాల్ కూడా ఎన్నికల కమిషన్‌కు బుధవారం లేఖ రాశారు.
ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో కలిసి ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించిన కిచ్చా సుదీప్.. తాను ఏ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. అదే సమయంలో ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తానని.. పోటీ మాత్రం చేయబోనని వెల్లడించారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తనకు చిన్నప్పటి నుంచి తెలుసని ఆయనకే తన మద్దతు అని ప్రకటించారు. అలాగే తనకు అండగా నిలిచిన వారి తరఫున పని చేస్తానని ప్రకటించారు.
'ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తాం'
అంతకుముందు.. సుదీప్ బీజేపీలో చేరుతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన మేనేజర్ జాక్ మంజుకు బెదిరింపు లేఖ అందింది. అందులో సుదీప్ ప్రైవేట్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని దుండగులు బెదిరించారు. దీంతో మేనేజర్ వెంటనే పుట్టెనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ బెదిరింపు లేఖపై కూడా సుదీప్ స్పందించారు. ఆ లేఖ పంపిన వారికి దీటైన జవాబు ఇస్తానని చెప్పారు. ఆ లేఖ ఎవరు పంపారో తన తెలుసని సుదీప్ అన్నారు.
సుదీప్ కెరీర్..
సీరియల్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్ మొదలుపెట్టిన సుదీప్ 'తాయవ్వ'తో వెండితెరకు పరిచయమయ్యారు. ఇందులో ఆయన సహాయ నటుడిగా కనిపించారు. 'స్పర్శ' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీ సినిమాల్లోనూ ఆయన అలరించారు. 'ఈగ' చిత్రంతో తెలుగువారికీ మరింత దగ్గరయ్యారు. ఇటీవల ఆయన నటించిన 'విక్రాంత్ రోణ'తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
కర్ణాటకలో 224 శాసనసభ స్థానాలకుగానూ ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మే 10న పోలింగ్ జరగనుండగా.. మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నువ్వా-నేనా అన్న రీతిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. నటులను పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. హీరోలను పార్టీలో చేర్చుకోవడం వల్ల వారి అభిమానుల ఓట్లను, వారి జనాకర్షణతో ప్రజల ఓట్లను కొల్లగొట్టొచ్చని పార్టీలు అభిప్రాయపడుతున్నాయి.