కర్ణాటకలో మరికొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. అధికార బీజేపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు. మరోవైపు, ఎన్నికలకు దూరంగా ఉండాలని హైకమాండ్ ఇచ్చిన సలహాను మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ కొట్టిపారేశారు. దీంతో కర్ణాటక బీజేపీలో రాజకీయాలు వేడెక్కాయి.
బీజేపీ సీనియర్ నేత ఈశ్వరప్పకు టిక్కెట్ ఇచ్చేందుకు బీజేపీ అధిష్ఠానం నిరాకరిస్తుందనే ఊహాగానాలు ఇటీవల వచ్చాయి. శివమొగ్గ సీటుకు ఈశ్వరప్ప తన కుమారుడు కేఈ కాంతేశ్ పేరును ప్రతిపాదించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇంతలోనే ఈశ్వరప్ప రిటైర్మెంట్ ప్రకటిస్తూ లేఖ రాయడం సంచలనంగా మారింది. ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు నడ్డాకు రాసిన లేఖలో ఈశ్వరప్ప పేర్కొన్నారు.
"నేను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నా. అందుకే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో నాకు టికెట్ కేటాయించొద్దని అభ్యర్థిస్తున్నా. నాకు అవకాశాలు ఇచ్చిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. బెంగళూరులో కొద్దిరోజుల క్రితం జరిగిన పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పా. అందుకు పార్టీ అగ్రనేతలు ప్రహ్లోద్ జోషి, నళిన్ కుమార్ ఖతీల్ అంగీకరించలేదు. అందుకే నా నిర్ణయాన్ని ఆమోదించాల్సిందిగా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశా. కర్ణాటకలో పూర్తి మెజారిటీతో బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి మరింత ప్రయత్నిస్తా."
-కేఎస్ ఈశ్వరప్ప, బీజేపీ సీనియర్ నేత
గత నాలుగు దశాబ్దాలుగా కర్ణాటకలో పార్టీని బలోపేతం చేయడంలో మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పతోపాటు కేఎస్ ఈశ్వరప్ప కీలక పాత్ర పోషించారు. ఈశ్వరప్ప బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రిగానూ పనిచేశారు. ఆయన బూత్ స్థాయి కార్యకర్త నుంచి పార్టీలో అంచెలంచెలుగా డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు. శివమొగ్గ నుంచి ఈశ్వరప్ప ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలాగే మంత్రిగానూ పనిచేశారు.
'హైకమాండ్ వద్దన్నా పోటీ చేస్తా!'
మరోవైపు, మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ సైతం బీజేపీ అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలకు దూరంగా ఉండాలని అధిష్ఠానం తనకు సూచించిందని, పార్టీకి విశ్వాసపాత్రుడిగా ఉన్న తనకు టికెట్ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో తాను తప్పక పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ విషయంలో నిర్ణయం మార్చుకోవాలని హైకమాండ్‌ను కోరినట్లు షెట్టర్ పేర్కొన్నారు.
"పెద్దల నుంచి నాకు కాల్ వచ్చిన మాట వాస్తవమే. సీనియర్ నేతగా ఇతరులకు అవకాశాలు ఇవ్వాలని హైకమాండ్ నాకు సూచించింది. ఉత్తర కర్ణాటకలో 30 ఏళ్లుగా పార్టీ కార్యకలాపాలను చూసుకుంటున్నా. వందలాది మందికి టికెట్లు ఇచ్చా. నాకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? సర్వేలు నాకు అనుకూలంగానే ఉన్నాయి. నా రాజకీయ జీవితంపై ఎలాంటి మచ్చలు లేవు. హైకమాండ్ చెప్పిన దానిపై నేను అసంతృప్తితో ఉన్నా. నామినేషన్లు సమర్పించేందుకు రెండ్రోజులే గడువు ఉంది. ఇప్పుడు ఇలా చెబితే ఎలా? సరైన బాధ్యతలు అప్పగిస్తామని వారు అంటున్నారు. ఏది ఏమైనా.. ఎన్నికల్లో పోటీ చేయకుండా వెనక్కి తగ్గేది లేదు. పోటీ చేసి భారీ ఆధిక్యంతో గెలుస్తా. మరో పదేళ్ల వరకు రాజకీయాల్లో క్రియాశీలంగానే ఉంటా. హైకమాండ్ తన నిర్ణయం మార్చుకోకపోతే ఏం చేయాలో తర్వాత చెబుతా."
-జగదీష్ షెట్టర్, మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత
224 శాసనసభ స్థానాలున్న కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అధికార బీజేపీ, కాంగ్రెస్ నువ్వా-నేనా అన్న రీతిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ ఎలాగైనా ఈసారి రాష్ట్రంలో అధికారం దక్కించుకోవాలని తహతహలాడుతోంది. మరోవైపు కుమార స్వామి నేతృత్వంలోని జేడీఎస్ కూడా కింగ్ మేకర్‌గా నిలిచేందుకు సిద్ధమవుతోంది.