కర్ణాటకలో అక్రమంగా తరలిస్తున్న పసిడిని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. మంగళూరు విమానాశ్రయంలో శనివారం ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.92.27 లక్షల విలువైన బంగారాన్ని గుర్తించారు.
దొరికిపోయాడిలా..
మంగళూరు జిల్లా ఉల్లాల్‌కు చెందిన మహ్మద్ ఆసిఫ్.. దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో సొంత జిల్లాకు వచ్చాడు. అధికారులు అతణ్ని తనిఖీ చేశారు. ప్రత్యేకంగా రూపొందించిన జీన్స్ ప్యాంటు, లోదుస్తులు, సాక్సుల్లో నుంచి 1.993 కిలోల పసిడి పొడి దొరికింది. దీని విలువ రూ.92.27 లక్షలు ఉంటుందని కస్టమ్స్ విభాగం అంచనా వేసింది. బంగారం పొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు.. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.
కేరళకు చెందిన మరో ఇద్దరు..
అదే విమానాశ్రయంలో జరిగిన మరో ఘటనలో.. కేరళ కాసరగోడ్‌కు చెందిన అబ్దుల్ సలాం.. శుక్రవారం(ఏప్రిల్ 2న) ఇండిగో విమానంలో పట్టుబడ్డాడు. అంతకుముందు రోజు(ఏప్రిల్ 1న) కాసరగోడ్(కేరళ) వాసి అష్రాఫ్ నుంచి 576 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. అష్రాఫ్.. జీన్స్ షర్ట్ ప్రెస్సింగ్ బటన్స్, బూట్లలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నాడని అధికారులు వెల్లడించారు. ఈ ఇద్దరి నుంచి సేకరించిన పుత్తడి విలువ రూ.26.43 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
ఇలా మూడు రోజుల్లోనే మొత్తం 2.569 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది కస్టమ్స్ విభాగం. దీని మొత్తం విలువ రూ.1.18 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది.
ఇదీ చదవండి: ఫోన్లో మాట్లాడుతూ.. ఒకేసారి 2 కరోనా డోసులు